సర్జరీ లేకుండా ప్రోస్టేట్ సమస్యకి విముక్తి
1 min read
75 ఏళ్ల వృద్ధుడికి పెరిగిన ప్రోస్టేట్
అప్పటికే బలహీనపడిన గుండె
మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలు కూడా..
అనంతపురం, న్యూస్ నేడు : హిందూపురం ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి ప్రోస్టేట్ బాగా పెరిగింది. ఆయనకు అప్పటికే రక్తపోటు, మధుమేహం ఉన్నాయి. వాటికి తోడు ఇషెమిక్ కార్డియోమయోపతి కారణంగా గుండె బాగా బలహీనం అయిపోయింది. గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం సాధారణంగా 55-70% ఉండాలి. కానీ ఆయనకు కేవలం 25% మాత్రమే ఉంది. అలాంటి వ్యక్తికి ప్రోస్టేట్ బాగా పెరిగిపోయింది. సాధారణంగా 20-25 క్యూబిక్ సెంటీమీటర్లు ఉండాల్సినది కాస్తా 130 సీసీకి చేరింది. కానీ, అప్పటికే ఆయనకు ఉన్న సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయడం అసాధ్యం. అలాంటి సమయంలో ఆయన అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ప్రోస్టేటిక్ ఆర్టెరీ ఎంబొలైజేషన్ (పీఏఈ) అనే చికిత్సతో నయం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మూడే సందీప్ తెలిపారు. ‘‘ప్రోస్టేట్ పెరగడం వల్ల మూత్రవిసర్జనలో కష్టం, అత్యవసరంగా వెళ్లాల్సిరావడం, తరచు మూత్రానికి పోవడం లాంటి సమస్యలుంటాయి. 51-60 ఏళ్ల మధ్యలోని పురుషుల్లో 50% మందికి, 70-79 ఏళ్ల మధ్యలోనివారిలో 70% మందికి, 80 ఏళ్లు దాటినవారిలో 80% పురుషులకు ఈ సమస్య వస్తుంది. ఈ కేసులో రోగికి వయసుతో పాటు ఇతర సమస్యలు కూడా ఉండడం వల్ల ఆయన శస్త్రచికిత్స చేయించుకోవడానికి సుముఖత చూపించలేదు. దాంతో ప్రోస్టేట్ ఆర్టెరీ ఎంబొలైజేషన్ (పీఏఈ) అనే అత్యాధునిక చికిత్స చేయాలని నిర్ణయించాం. ఇది చాలా అరుదైన పద్ధతి. ప్రోస్టేట్ పరిమాణం 100 సీసీ దాటిన వారు, మత్తుమందు ఇవ్వడానికి కుదరని కేసులు, గుండె సమస్యలు ఉన్నవారు.. ఇలాంటివారికి ఈ చికిత్స బాగా ఉపయుక్తం. ఇందులో భాగంగా ప్రోస్టేట్ గ్రంధికి రక్తసరఫరా చేసే రక్తనాళాల్లోకి చిన్నచిన్న కణాలను ఇంజెక్ట్ చేస్తాం. దానివల్ల అవి సన్నబడిపోయి, ప్రోస్టేట్‌కు రక్తసరఫరా బాగా తగ్గిపోతుంది. అప్పుడు ప్రోస్టేట్ క్రమంగా కుచించుకుపోయి, లక్షణాలు తగ్గుతాయి. దీన్ని సాధారణంగా ఔట్‌పేషెంట్ విధానంలో క్యాథ్ ల్యాబ్‌లోనే చేస్తాం. ఇది చాలా సురక్షితమైనది, సమర్థంగా పనిచేస్తుంది. ఏదైనా కారణం వల్ల శస్త్రచికిత్సలు చేయించుకోలేనివారికి ఇది బాగా ఉపయోగపడుతుంది’’ అని డాక్టర్ మూడే సందీప్ తెలిపారు. ‘‘పీఏఈ వల్ల సంప్రదాయ శస్త్రచికిత్సలో ఉండే రక్తస్రావం, నొప్పి, ఇతర ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. దీనికి లోకల్ ఎనస్థీషియా మాత్రమే ఇస్తాం. అందువల్ల శ్వాసపరమైన ఇబ్బందులు, ఇతరత్రా కూడా రావు. సాధారణంగా ఏదైనా పెద్ద శస్త్రచికిత్స చేయాల్సి వస్తే ఆ తర్వాత రోగి కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ, ఇందులో ఆస్పత్రిలో గడపాల్సిన సమయం తగ్గిపోతుంది, త్వరగా తమ పనులు తాము చేసుకోవచ్చు. అలాగే, ప్రోస్టేట్ శస్త్రచికిత్స చేస్తే లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. ఇందులో ఆ సమస్య కూడా ఉండదు’’ అని ఈ చికిత్సలో పాల్గొన్న డాక్టర్ జి.దుర్గాప్రసాద్, డాక్టర్ వై. మధుమాధవరెడ్డి చెప్పారు.