5 లక్షల మందిలో ఒకరికి వచ్చే రీనల్ హైడాటిడ్ సిస్ట్
1 min read– అనంతపురం కిమ్స్ సవీరా ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స
– అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను
– ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేసిన వైద్యులు
పల్లెవెలుగు వెబ్ అనంతపురం: ఇంట్లో కుక్కలను పెంచుకునేవారు, లేదా బయట అయినా వాటితో సన్నిహితంగా మెలిగేవారు తమ ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వచ్చే అత్యంత అరుదైన వ్యాధి.. హైడాటిడ్ సిస్ట్. ఇది కాలేయం, ఊపిరితిత్తుల్లో సంభవిస్తుంది. అత్యంత అరుదుగా గుండె, వక్షస్థలం, థైరాయిడ్, మెడలోని మృదు కణజాలాలు, మూత్రపిండాల్లోనూ వస్తుంది. కుక్కల మలం మీద వాలిన పరాన్నజీవులు ఆ తర్వాత కూరగాయలు, పండ్లు లేదా ఇతర ఆహారపదార్థాల మీద చేరడం, వాటిని మనుషులు తినడం వల్ల ఇది వస్తుంది. మూత్రపిండాల్లో హైడాటిడ్ సిస్ట్ అనేది అత్యంత అరుదుగా.. అంటే ప్రతి 5 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఇది వచ్చిన కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు. ఇలాంటి వ్యాధి వచ్చిన ఒక వ్యక్తికి అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు, రీనల్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు.
‘‘అనంతపురం జిల్లాకు చెందిన 54 ఏళ్ల వ్యక్తికి ఇదే సమస్య వచ్చింది. ఆయనకు ఏడాది నుంచి కడుపునొప్పి, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలున్నాయి. గత మూడు నెలలుగా విపరీతంగా వాంతులు కావడం, దానికి మాత్రలు వేసుకుంటే మాత్రమే తగ్గడం ఉంటోంది. ఆరు నెలల్లో బరువు గణనీయంగా తగ్గిపోయారు. ఆయనకు వైద్యపరీక్షలు చేస్తే.. కుడివైపు మూత్రపిండం బాగా వాచినట్లు కనిపించింది. మరిన్ని పరీక్షలు చేస్తే ఆయనకు ఏకంగా 15 * 17.5 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న అతిపెద్ద హైడాటిడ్ సిస్ట్ ఉంది. ఇది కుడివైపు మూత్రపిండాన్ని పూర్తిగా ఆక్రమిస్తూ.. దాన్ని నొక్కేస్తోంది. కాలేయం ఉపరితలానికి కొద్దిగా అతుక్కున్నట్లు ఉండటంతో పాటు, గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన రక్తనాళం మధ్య నుంచి వెళ్తోంది.ఈ కేసుల చాలా సవాలుతో కూడుకున్నది అయినా.. మేం తీసుకున్నాం. ముందుగా శరీరంలో ఉండే పరాన్నజీవులను చంపడానికి మనిషి బరువులో ప్రతి కిలోకు 10 మిల్లీగ్రాముల చొప్పున ఆల్బెండజోల్ ఇచ్చాం. తర్వాత లాపరోటమీ అనే శస్త్రచికిత్స చేసి, అత్యంత జాగ్రత్తగా హైడాటిడ్ సిస్ట్‌ను, దాంతోపాటు మూత్రపిండాన్ని కూడా చాలా కష్టమ్మీద తొలగించాం. శస్త్రచికిత్సకు 4 గంటల సమయం పట్టింది. మూడు రోజులకు రోగి బాగా కోలుకున్నారు, నాలుగో రోజున ఎలాంటి సమస్యలు ఉండకపోవడంతో అతడిని డిశ్చార్జి చేశాం. తీసిన భాగాన్ని బయాప్సీకి పంపగా, అది మూత్రపిండంలోని హైడాటిడ్ సిస్ట్ అని నిర్దారణ అయ్యింది. గత రెండు నెలలుగా రోగిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రతి రెండు వారాలకు అల్ట్రాసౌండ్ స్కానింగ్, కాలేయ పనితీరు పరీక్ష, మూత్ర విశ్లేషణ లాంటివి చేసి, మళ్లీ సిస్ట్ పునరావృతం కాలేదని నిర్ధారించుకున్నాం. మూత్రపిండాల్లో హైడాటిడ్ సిస్ట్ అనేది అత్యంత అరుదుగా.. ప్రతి 5 లక్షల మంది జనాభాలో కేవలం ఒక్కరికి మాత్రమే వస్తుంది. దీనికి సంబంధించిన శస్త్రచికిత్సను అత్యంత జాగ్రత్తగా చేయాలి. ఇందులో సిస్ట్ ఏమాత్రం పగలకూడదు. పొరపాటిన పగిలితే.. అందులోని ద్రవం చుట్టూ పడిపోయి, వెంటనే మన రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి, ఆపరేషన్ టేబుల్ మీదే రోగి మరణించే ప్రమాదం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు అత్యంత జాగ్రత్తగా సిస్ట్ మొత్తాన్ని తొలగించాం. ఇంతకుముందు ఇలాంటి కేసులను పెద్ద పెద్ద వైద్య కళాశాలలు, ఇతర పెద్ద ఆస్పత్రులకే పంపేవారు. కానీ ఇప్పుడు శస్త్రచికిత్సలు చేయడంలో నైపుణ్యం, అద్భుతమైన వైద్యపరమైన మౌలిక సదుపాయాలు ఉండటంతో ఇంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయగలుగుతున్నాం. ఈ కేసులో రోగి పేదవారు కావడంతో ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితంగా చేయడం మరో విశేషం’’ అని డాక్టర్ దుర్గాప్రసాద్ వివరించారు. ఈ శస్త్రచికిత్సలో ఇంకా కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ నరేంద్రనాథ్, చీఫ్ ఎనస్థటిస్ట్ డాక్టర్ రవిశంకర్, ఎనస్థటిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.