‘మరమ్మతు’.. అసౌకర్యం కారాదు..!
1 min readముందస్తు జాగ్రత్తలు తీసుకోండి
– పురపాలక శాఖ అధికారులకు సూచించిన నగర మేయర్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు కార్పొరేషన్: అభివృద్ధి, మరమ్మతు పనుల కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగరాదని నగర మేయర్ బీవై రామయ్య మున్సిపల్ శాఖ అధికారులకు సూచించారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద ప్రధాన రహదారిపై (స్టేట్ బాంక్ ఎదురుగా) మంచినీటి సరఫరా పైపులైన్ కు మున్సిపల్ శాఖ సిబ్బంది, రోడ్డు మధ్యలో గుంతను త్రవ్వి మరమ్మతులు చేపట్టారు. ఆ ప్రాంతం ప్రధాన రహదారి కావడంతో వాహన దారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని అటుగా వెళుతూ గమనించిన నగర మేయర్ బి.వై. రామయ్య తక్షణమే స్పందించి డీఈ రసూల్, ఏఈ హిమబిందులతో మాట్లాడారు. ప్రధాన రాహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా మరమ్మతులు చేసేందుకు గుంతను, తవ్విన మట్టిని సరిచేయవాల్సిందిగా ఆదేశించారు. మేయర్ ఆదేశాలపై తక్షణమే స్పందించిన పురపాలక సిబ్బంది పది నిమిషాల్లోనే సదరు ప్రాంతంలో రహదారిపై వాహన చోదకులకు అసౌకర్యం కలగకుండా మట్టిని తొలగించి ట్రాఫిక్ నియంత్రణకు సూచికను అమర్చారు. పైప్ లైన్ లీకేజీ కారణంగా రెండు రోజుల క్రితం మరమ్మతులు చేపట్టామని, పరిశీలనలో ఉన్న కారణంగానే ప్రజలకు కొంతమేరా అసౌకర్యం కలిగిందని మున్సిపల్ అధికారులు వివరణ ఇచ్చారు.