సీఎం పర్యటనలో తొలగించిన స్పీడ్ బ్రేకర్లను పునరుద్ధరించండి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పట్టణంలోను, పాఠశాలలు, కాలేజీల ముందు తొలగించిన స్పీడ్ బ్రేకర్లను తక్షణమే పునరుద్ధరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం సంబంధితఅధికారులను డిమాండ్ చేశారు. పట్టణంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న పాఠశాలల ముందు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రమాదాల బారి నుండి రక్షించాలని ఆర్ అండ్ బి అధికారి అరుణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి నజీర్ మాట్లాడుతూ, పత్తికొండ పట్టణంలో గత రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పత్తికొండలో పర్యటన సందర్భంగా హై స్కూల్ దగ్గర నుండి ఎస్టీ జోసెఫ్ స్కూల్ దగ్గర వరకు ఉన్న స్పీడ్ బ్రేకర్లను తొలగించారని అన్నారు. అదే రహదారిలో ఉన్నత ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని విద్యార్థులు తమ అవసరాలు నిమిత్తం తిరుగుతూ ఉంటారని స్పీడ్ బ్రేకర్లు లేనందువల్ల ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంటుందని ఆయన వాపోయారు. స్కూల్ వదిలిన సమయంలో విద్యార్థులందరూ ఒకేసారి రోడ్డు మీదకు వస్తుంటారు. గతంలో స్పీడ్ బ్రేకర్స్ ఉండటం వలన ప్రమాదాలు జరిగేవి కావని, ఉన్న స్పీడ్ బ్రేకర్లను తొలగించడం వలన విద్యార్థులకు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. గత రెండు వారాల క్రితం ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ధర్మ తేజ అనే విద్యార్థి పాఠశాల వదిలిన తరువాత రోడ్డు దాటుతున్న సమయంలో ఆ విద్యార్థికి బైక్ యాక్సిడెంట్లో గాయాలపాలు అయ్యాడని తెలిపారు.కాబట్టి అధికారులు వెంటనే స్పందించి పాఠశాలలు, కళాశాల ల ముందు తొలగించిన స్పీడ్ బ్రేకర్లను తక్షణమే ఏర్పాటు చేసి, చదువుకుంటున్న విద్యార్థులకు ప్రమాదాల నుండి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలుచేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి శివ, విద్యార్థి సంఘం నాయకులు పవన్, రమేష్, రాజు, మహేష్, సోము తదితరులు పాల్గొన్నారు.