రీసర్వే పనుల పురోగతి పై సమీక్ష సమావేశం
1 min read– భూహక్కు పత్రాలను పంపిణీ త్వరితగతిన చేపట్టండి
– భూరక్ష (సరిహద్దు రాళ్లను) వేగవంతంగా పూర్తి చేయండి : సర్వే కమీషనర్ సిద్ధార్థ్ జైన్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : భూహక్కు పత్రాలను పంపిణీ త్వరితగతిన చేపట్టండంతో పాటు భూరక్ష (సరిహద్దు రాళ్లను) వేగవంతంగా పూర్తి చేయాలని సర్వే కమీషనర్ సిద్ధార్థ్ జైన్ జాయింట్ కలెక్టర్ కు సూచించారు.బుధవారం విజయవాడ కమీషనర్ కార్యాలయం నుంచి వెబెక్స్ ద్వారా రీసర్వే పనుల పురోగతి పై సర్వే కమీషనర్ సిద్ధార్థ్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్వే కమీషనర్ మాట్లాడుతూ రీసర్వే పనుల వారాంతపు లక్ష్యాలను నిర్దేశించుకొని పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు ప్రింట్ అయి వచ్చిన భూహక్కు పత్రాలను రైతులకు అందజేయాలన్నారు. అదే విధంగా భూ రక్ష (సరిహద్దు రాళ్లను) కూడా వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కు సర్వే కమీషనర్ సూచించారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ రీసర్వే పనులలో భాగంగా ఇచ్చిన వారాంతపు లక్ష్యాలను గడువు లోపల పూర్తి చేస్తున్నామని సర్వే కమీషనర్ కు వివరించారు. అదే విధంగా ఫేజ్-3 రీ సర్వేలో భాగంగా 160 గ్రామాలను రీసర్వే జరుగుతుందని కూడా తెలిపారు.సమావేశంలో సర్వే ఏడి విజయ సారథి, కె.ఆర్.సి.సి డిప్యూటీ కలెక్టరు నాగ ప్రసన్న లక్ష్మి, ట్రైనీ డిప్యూటీ కలెక్టరు రమాకాంత్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.