పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి: ఏపీటీఎఫ్ డిమాండ్
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ప్రజాసంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులకు , ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని గడిగరేవులలో జరిగిన ఏపీటీఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి అంతకన్నా ప్రమాదకరమైన గ్యారెంటీ పెన్షన్స్ స్కీమ్( జిపిఎస్) ను తీసుకుని రావడం దుర్మార్గమైన విధానమని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత సామాజిక భద్రతను కల్పించే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి పాఠశాలల తనిఖీల సందర్భంగా విద్యార్థుల ముందు ఉపాధ్యాయులను, ఉపాధ్యాయుల ముందు జిల్లా విద్యాశాఖ అధికారులను అవమానకరంగా మాట్లాడడం, ప్రతి చిన్న విషయానికి చార్జి మెమోలు ఇవ్వడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. పాఠశాలలో విద్యా బోధనను పరిశీలించడం , సలహాలు, సూచనలు ఇవ్వడంలో తప్పులేదని అయితే తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను వేధించడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు నూతన సర్వీసు రూల్స్ ఆలస్యం అవుతున్నందున ప్రస్తుతం ఉన్న సర్వీస్ రూల్స్ ప్రకారం తక్షణమే బదిలీలు, పదోన్నతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు అయినటువంటి జడ్పీపీఎఫ్ లోన్లు, ఎపిజిఎల్ఐ లోన్లు, తుది క్లెయిమ్స్ అలాగే సరెండర్ లీవ్ నగదు బకాయిలు తక్షణమే చెల్లించి ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను తీర్చాలని ఆయన అన్నారు. అలాగే ప్రతినెల నెలవారి జీతాలు ఆలస్యం అవుతున్నాయని అలా కాకుండా ఒకటవ తేదీన జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వము ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్. మహబూబ్ బాషా, ఎ. నాగన్న , నంద్యాల జిల్లా కార్యదర్శి ఆవుల మునిస్వామి, గడివేముల మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగాల బాలస్వామి, మానపాటి రవి, సీనియర్ నాయకులు ఎం. ప్రతాపరెడ్డి, కె. రాముడు, బి. రాంపుల్లారెడ్డి, మారెన్న, జి. శ్రీరాములు, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర ఆచారి, మహిళా ప్రతినిధులు యు. కవిత, లక్ష్మీదేవి, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.