‘ఆశ్రమం’ ముసుగులో…దోపిడీ
1 min readఆశ్రయం కోసం లక్ష రూపాయలు ఇచ్చిన వృద్ధులు..
- తిరిగి ఇవ్వాలని అడిగితే.. బెదిరింపులు
- ఆదోని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వృద్ధదంపతులు
పల్లెవెలుగు, కర్నూలు:కొడుకు..కోడళ్లతో గొడవ పడి… మనశ్శాంతి కోసం అనాథ ఆశ్రమాల్లో ఉండేందుకు వచ్చిన వృద్ధులకు… అక్కడ కూడా వేధింపులు… బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఆధునిక జీవన శైలికి అలవాటు పడిన కొడుకులు.. కోడళ్లతో ఇమడ లేక… కుటుంబ పెద్దలు ఆశ్రయం కోసం ఆశ్రమం వైపు చూస్తున్నారు. ఆశ్రమ నిర్వాహకుల మాటలను నమ్మి… నిలువునా దోపిడీకి గురవుతున్నారు. అటు కొడుకుకు చెప్పుకోలేక… పోలీసుల దగ్గరకు వెళ్లలేక అవస్థలు పడుతున్న వృద్ధదంపతులు ఓ ఆశ్రమ నిర్వాహకుడిపై ఆదోని సబ్ కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేశారు.వివరాలిలా ఉన్నాయి.
జీవన జ్యోతి ఆశ్రమంలో… :
ఆదోని పట్టణం ఆస్పరి రోడ్డులో ఉన్న జీవనజ్యోతి ఆశ్రమము గత 20 సంవత్సరాల నుండి వృద్ధులకు సేవలు అందిస్తుంది వృద్ధులకు ఆశ్రయం తో పాటు మూడు పూటలా భోజనం కూడా కల్పిస్తారు. ఆదోని డివిజన్లో ఉన్న ఏకైక అనాధ వృద్ధాశ్రమం కాబట్టి ప్రజలందరూ వారి వారి కుటుంబంలో ఏ శుభకార్యము జరిగినా వారి జ్ఞాపకార్థము వృద్ధులకు భోజన వసతి ఏర్పాటు చేస్తారు చనిపోయిన వారి జ్ఞాపకార్థము పుట్టినరోజు సందర్భంగా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా వృద్ధులకు ఆశ్రమంలో మంచి భోజనమును ప్రజలు ఏర్పాటు చేస్తారు గత 20 సంవత్సరాల నుండి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఆశ్రమ నిర్వాహకులు ఫిలిప్స్ నేడు లోగుట్టు బయటపడింది.
బలహీనతతో.. సొమ్ము..:
ఆశ్రయం గురించి ఆ నోట ఈ నోట విన్న ఇద్దరు వృద్ధ దంపతులు గత ఫిబ్రవరి నెలలో ఆశ్రమానికి వెళ్లారు వారి బలహీనతను గుర్తించిన నిర్వాహకులు ఆశ్రయం కావాలంటే లక్ష రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కొడుకులతో గొడవలు పడి వచ్చిన వృద్ధ దంపతులు ఎక్కడో ఒకచోట ఉండాలి కాబట్టి తన భార్యతో దాచుకున్న బంగారం ను తాకట్టు పెట్టి లక్ష రూపాయలు తెచ్చి ఆశ్రమ నిర్వాహకులు ఫిలిప్స్ కు ఇచ్చారు. ఇదివరకే ఉన్న ఒక షెడ్డును శుభ్రపరిచి అందులో ఉండమని ఫిలిప్స్ వారికి సూచించారు. వారికి బాత్రూం ఫెసిలిటీ కూడా కల్పించారు. తీరా నెలరోజులు గడిచిన తర్వాత వారికొస్తున్న పెన్షన్ కూడా ఇవ్వమన్నాడు. తన భార్య అనారోగ్యంగా ఉందని మందులకు డబ్బులు కావాలని పెన్షన్ ఇవ్వలేమని చెప్పాడు, ఆశ్రయంలో ఉన్న అందరూ వారి యొక్క పెన్షన్ ను తనకే ఇస్తున్నారని మీరు కూడా ఇవ్వాల్సిందే అని గట్టిగా చెప్పాడు నిర్వాహకులు. భయపడ్డ వృద్ధ దంపతులు షెడ్డును ఖాళీ చేసి బయటకు వచ్చేశారు.
వృద్ధులకు.. సబ్ కలెక్టర్ హామీ..:
ఇప్పుడు తనకిచ్చిన లక్ష రూపాయలు ఇవ్వమని వృద్ధులు బ్రతిమలాడారు. అందుకు నిర్వాహకుడు ఇవ్వలేనని అన్నాడు. ఎలాగో కొడుకులు తో గొడవపడి వచ్చారని, కొడుకులు వచ్చి అడగలేరనే ధీమాతో మీరిచ్చిన డబ్బును డొనేషన్ రూపంలో రాసుకున్నానని, అందుకు మీరు సంతకం చేశారని, కాబట్టి మీరు ఇచ్చిన లక్ష రూపాయలు ఇవ్వలేనని ఎవరికైనా చెప్పుకోండి అని చెప్పడంతో వృద్ధ దంపతులు వెనుతిరిగారు. స్పందన కార్యక్రమంలో సోమవారం నాడు సబ్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఎలాగైనా తనుకు న్యాయం చేయమని ఆ డబ్బు వాళ్లకు ఎంతో అవసరం అని ఆశ్రమం కు డొనేషన్ ఇచ్చే పరిస్థితిలో మేము లేమని సబ్ కలెక్టర్ ను ప్రాధేయపడ్డారు. ఇందుకు స్పందించిన సబ్ కలెక్టర్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.