రూ.1999కే సిటీ స్కానింగ్
1 min read – ప్రైవేట్ డయగ్నోస్టిక్ సెంటర్లలో నేటి నుంచే అమలు
– రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
పల్లెవెలుగు వెబ్, మహబూబ్నగర్ : కరోనా నేపథ్యంలో పేదలకు రూ.1999కే సిటీస్కానింగ్ చేసేలా డయాగ్నోస్టిక్ సెంటర్ల అసోసియేషన్ అంగీకరించిందని, మంగళవారం నుంచే అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పేదలకు సహకరించాలన్న సదుద్దేశంతో నేటి నుంచి జిల్లాలో అతితక్కువ ధరకు రూ.1999కే సిటీస్కానింగ్ చేస్తామని డయాగ్నోస్టిక్ సెంటర్ అసోసియేషన్ అంగీకరించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రేమిడిసివర్ ఇంజక్షన్లు అందుబాటులో పెడుతున్నామని, ధరల నియంత్రణ విషయమై డి ఎం హెచ్ ఓ ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఆర్డివో,డిఎస్పి లతో టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
‘పైవేట్’లో 20 శాతం బెడ్లు..
ప్రైవేట్ ఆస్పత్రులలో 20 శాతం బెడ్లు తప్పనిసరిగా పేదలకు కేటాయించాలని, కేటాయించకపోతే ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకుంటుందని, కేటాయించిన 20శాతం బెడ్ లకు ప్రత్యేక కలర్లతో మార్కింగ్ ఇవ్వాలని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు 450 రేమిడిసివర్ ఇంజక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించామని,ఇంజెక్షన్లు ఎంఆర్పి ధరలకే విక్రయించాలని లేదంటే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి కింద 23 మంది లబ్ధిదారులకు 10 లక్షల 4 వేల 500 రూపాయల చెక్కులను మంత్రి శ్రీనివాస గౌడ్ పంపిణీ చేశారు.