కోవిడ్ బాధిత బీసీలకు రూ.5 లక్షలు
1 min read– జేసీ( ఆసరా మరియు వెల్ఫేర్) ఎంకేవీ శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లాలో కోవిడ్ కారణంగా ఇంటి యజమాని లేదా యజమానురాలు చనిపోతే.. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్బీసీ ఎఫ్డీసీ నిధుల ద్వారా రూ.5లక్షలు మంజూరు చేస్తుందని జేసీ( ఆసరా మరియు వెల్ఫేర్) ఎంకేవీ శ్రీనివాసులు తెలిపారు. ఆ నిధులను స్వయం ఉపాధికి వినియోగించాలని, అందుకు సంబంధించిన వివరాలు ఈ నెల 23 వ తేదీలోపు బీసీ కార్పొరేషన్ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని ఆయన ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేసీ( ఆసరా మరియు వెల్ఫేర్) మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు వర్తిస్తాయన్నారు. అనంతరం బీసీ కార్పొరేషన్ ఈడీ శిరీష్ మాట్లాడుతూ కోవిడ్‌తో మరణించిన కుటుంబ యజమాని 18–60 సంవత్సరముల వయస్సు కలిగియుండవలెను. వివరాలను గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి ప్రతిపాదనలును బీసీ కార్పొరేషన్‌కు పంపాలని మండల పరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించామన్నారు. కుటుంబ సంవత్సరం ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండి, తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, మరణ ధ్రవీకరణ పత్రమలతో సమర్పించాలని ఈడీ శిరీష వెల్లడించారు.