ఆర్టీసీ కార్మికులు..ఎర్రబ్యాడ్జీలతో విధులు..
1 min readపల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి:రాయచోటి డిపో అధికారులు వేధిస్తున్నారంటూ…నిరసనగా సోమవారం నేషనల్ మజ్దూర్ యూనిటి అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తరువాత భోజన విరామ సమయము నందు జరిగిన గేటు ధర్నాను ఉద్దేశించి డిపో సెక్రటరీ శ్రీ యహియా భాషా మాట్లాడుతూ, డిపో యందు అధికారుల వేధింపులు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయని, ముఖ్యంగా సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగేంద్ర నాయక్ గారు సెలవులు మంజూరు చేయు విషయంలో మరియు చార్టు యందు డ్యూటీ లు వేయు విషయంలోనూ పక్షపాత ధోరణి అవలంబిస్తూ, అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సర్వీసులను తన ఇష్టానుసారం మార్పులు చేయడమే కాకుండా, అధిక ఆదాయం వచ్చే సర్వీసులను రద్దు చేయడం జరుగుతున్నదని తెలిపారు. రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం అయినప్పటికీ, కొత్త సర్వీసులు పెట్టక పోగా, ఉన్న సర్వీసులను రద్దు చేస్తూ, ఆదాయం మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా తన స్వలాభం కోసం కొంతమందిని ఓ డి లలో పెట్టుకుని, డిపో మేనేజర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అనంతరం జోనల్ నాయకులు రాజా రావు మాట్లాడుతూ, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అరాచకాలకు డిపో మేనేజర్ గారు మరియు అసిస్టెంట్ మేనేజర్ వత్తాసు పలుకుతూ కార్మికుల సమస్యలపై ఏమాత్రం స్పందన లేకుండా ప్రవర్తించడం జరుగుతున్నదని తెలిపారు. ఎస్. టి .ఐ గారి వేధింపులపై పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడం వలన ఈ రోజు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపవలసి వచ్చినదనీ, ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకోకపోతే జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్యారేజ్ సెక్రెటరీ శ్రీ హరి బాబు గారు, శ్రీ విజయ్ గారు, శ్రీ ఎన్ శివప్రసాద్ గారు, శ్రీ ఎస్ ఎస్ రెడ్డి గారు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొనడం జరిగినది.