పోలీసు అమరవీరుల త్యాగం.. అజరామరం..
1 min read– కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ & సెషన్స్ జడ్జి డా.వి.రాధాక్రిష్ణ కృపా సాగర్
– అమరవీరుల స్ధూపానికి ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం… చిరస్మరణీయమన్నారు కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ & సెషన్స్ జడ్జి డా.వి.రాధాక్రిష్ణ కృపా సాగర్, జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి. గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ & సెషన్స్ జడ్జి డా.వి. రాధాక్రిష్ణ కృపా సాగర్, జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా సెషన్స్ జడ్జి డా.వి. రాధాక్రిష్ణ కృపా సాగర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యతన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న జరిగిన దురదృష్ట సంఘటనను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను సంస్మరణం చేసుకోవడం కోసం ప్రతి ఏటా అక్టోబర్ 21 పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం. శాంతి భద్రతల కట్టడిలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పోలీసులు పోలీస్ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహించారన్నారు. సమాజం ఎప్పుడూ వారి సేవలను గుర్తుంచుకుంటుందన్నారు.
ఆ తరువాత జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. కర్నూలు జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా గత సంవత్సరం 16 మంది పోలీసు వీరయోధులు మృతిచెందారన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి నియంత్రణలో కర్నూలు జిల్లాలో విధినిర్వహణలో పోలీసులు 5 మంది వీర యోధులుగా మృతి చెందారన్నారు. వారినందరిని స్మరించుకోవడం మన ధర్మం అన్నారు. సమాజం కోసం, భవిష్యత్తు తరాల కోసం, ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు (భద్రత క్రింద 5 లక్షలు, ఎక్స్ గ్రేషియా క్రింద 5 లక్షలు) ఎక్స్ గ్రేషియా అందజేసిందన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ జనార్ధన్ కు 20 లక్షల భద్రత ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేశారు.
అమరుల కుటుంబీకులకు.. ఘన సన్మానం…
దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 377 మంది పోలీసుల పేర్లను ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషా చదివి వినిపించారు. అందరికి శ్రధ్దాంజలి ఘటిస్తూ, నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులైన పోలీసు కుటుంబాల వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీమణి నాగ ప్రశాంతి, సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా, హోంగార్డు కమాండెంట్ రామ్మోహన్, డిఎస్పీలు మహేశ్వరరెడ్డి, వెంకటాద్రి, వెంకట్రామయ్య, రమణ, కెవి మహేష్, శ్రీనివాస రెడ్డి, రవీంద్రా రెడ్డి, రామాంజినాయక్, ఇలియాజ్ భాషా, ఎఓ సురేష్ బాబు, పోలీసు వేల్పేర్ డాక్టర్ స్రవంతి గారు, సిఐలు, ఆర్ ఐలు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు, పోలీసు కుటుంబాల పాల్గొన్నారు.