బనగానపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
1 min read– పాతపాడులో వైభవంగా యాగంటిశ్వరుని పార్వేట ఉత్సవం
– పొర్లుదండాలతో మొక్కులు చెల్లించుకున్న చిన్నారులు
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలంలో గ్రామీణ,పట్టణ తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబిచేలా సంక్రాంతి సంబరాలు కన్నుల పండువుగా జరిగాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటా వాకిళ్లు రంగవల్లులతో నిండిపోయాయి. మహిళలు తెల్లవారుజాము నుండే తమ ఇంటి ముంగిట భోగి మంటలు గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల ప్రదర్శన, పతంగులు,రథం ముగ్గులను తెలియజేసే విధంగా రంగవల్లులు వేసుకున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు సంబరాల్లో మునిగి తేలారు. పలు ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఆదివారం మకర సంక్రాంతి రోజున తీపి పదార్థాలు చేసుకుని పండుగ జరుపుకొన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు సోమవారం కనుమ, మంగళవారం ముక్కనుమ పండుగలతో సరదాగా గడిపారు ఇది ఇలావుండగా మండలంలోని ప్రముఖ దైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో క్షేత్రం కిటకటలాడింది. స్వామివారి పార్వేట ఉత్సవం కారణంగా ఉదయం దేవస్థానంలో శ్రీ ఉమామహేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రధాన పూజారి మహేష్ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ ఓబుల్ రెడ్డి ,పాలకమండలి సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిపై ఆలయం చుట్టూ నందికొల ప్రదర్శనతో ప్రదక్షిణలు చేసి పార్వేట ఉరేగింపునకు శ్రీకారం చుట్టారు. ఈ పార్వేట ఉత్సవం క్షేత్ర పరిధిలోని పాతపాడు, మీరాపురం, సాధకొట్టం, యాగంటిపల్లె గ్రామాల్లో స్వామివారి పల్లకి ఊరేగింపుతో పార్వేట చేసి తిరిగి సోమవారం సాయంత్రానికి తిరిగి యాగంటి దేవస్థానం చేరుకోవడంతో ముగిసింది. అలాగే బనగానపల్లె పట్టణంలోని కొండపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకిపై తీసుకువెళ్లి ఘనంగా పార్వేట ఉత్సవాలను నిర్వహించారు.