సర్వ మంగళప్రదం వరలక్ష్మి అర్చనం..
1 min read– ఆధ్యాత్మిక పరిమళంతో పరవశించిన వెంకటనాయునిపల్లె
– ధార్మిక కార్యక్రమాల్లో పెల్లుబికిన ఉత్సాహం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పరమ పవిత్రమైన శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం రోజున సౌభాగ్యదాయిని, సుఖప్రదాయిని అయిన వరలక్ష్మీ మాతను అర్చించుకోవటం సర్వమంగళప్రదమని” తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి అన్నారు. డోన్ మండలం, వెంకట నాయునిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు మంగళవారం ప్రారంభమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగి శుక్రవారం వరలక్ష్మీ పూజా, కుంకుమార్చన, గోపూజలతో ముగిశాయి. మూడు రోజులపాటు వరుసగా శ్రీమద్రామాయణము, మహాభారతము, భాగవతము మరియు భగవద్గీత లాంటి గ్రంథాల నుంచి విశేషాలను, ఆధ్యాత్మిక అంశాలను, మానవ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అంశాలను నిత్య ఆచరణీయ ధర్మాలను ఆధ్యాత్మిక ఉపన్యాసకులు సాహితీవేత్త డాక్టర్ టి సురేశ్ బాబు వివరించారు. ఉపన్యాసాల్లో భాగంగా రామాయణంలోని పితృ వాక్య పరిపాలన, సోదరప్రేమ, ప్రజారంజక పరిపాలన, మైత్రీ తత్వము; లోభత్వము, అహంకారము మొదలైన గుణాలను ఆధారంగా చేసుకుని యే యే పాత్రలు ఏ విధంగా ప్రవర్తించిందీ వివరించారు. రెండవ రోజు మహాభారతాంశాల వివరణలో భాగంగా అహంకారం ఎంతటి వినాశకారియో వివరిస్తూ ఉదాహరణలతో మనసుకు హత్తుకునేలా వివరించారు. మూడవరోజు భాగవత, భగవద్గీత అంశాలతో పాటు హిందూ జీవన విధానం యొక్క ప్రత్యేకతను, ప్రాముఖ్యతను, విశిష్టతను, వసుధైకకుటుంబ భావన ప్రభావాన్ని, ఆచార సంప్రదాయాల్లో ఉన్న వైజ్ఞానికతను వివరించారు.నాలుగో రోజు శుక్రవారం పైగా వరలక్ష్మీ వ్రతం కావడంతో మహిళా మూర్తులు అందరి చేత సామూహిక వరలక్ష్మీ వ్రతం, కుంకుమార్చన మరియు గోపూజ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఆధ్యాత్మిక శోభతో అలరారిన ఆలయం నాలుగో రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ శివ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణమంతా మామిడి తోరణాలు, పుష్పాలంకరణతో అలరారింది .అమ్మవారి ప్రతిమకు మహిళామణులు విశేషమైన పూజలు చేశారు. దాదాపు 100కు పైగా మహిళా మూర్తులు వరలక్ష్మి అమ్మవారి ప్రతిరూపమైన శ్రీ చక్రానికి కుంకుమార్చన చేశారు. ఆలయ అర్చకులు శ్రీ మేనేశ్వరయ్య అందరి చేత గణపతి పూజ , లక్ష్మీపూజ, లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన నిర్వహించారు. తదనంతరం పరమ పుణ్యప్రదమైన సహస్రనామ స్తోత్ర పారాయణం టి.సురేష్ బాబు ద్వారా నిర్వహించారు. విశేషంగా గోపూజ శోభాయాత్ర కార్యక్రమంలో చివరిగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజా కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గోవుతో వీధులలో నిర్వహించిన శోభాయాత్ర, నగర సంకీర్తన అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం చంద్రశేఖర్, న్యాయవాదులు శీలం స్వర్ణలత, శీలం శ్రీలత, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి బి.రామకృష్ణ, ఎల్లప్ప స్వామి సత్సంగ ప్రముఖ్ రామకృష్ణ, అర్చకులు జె. మీనేశ్వరయ్య, భజన మండలి సభ్యులు జె. చంద్రశేఖరయ్య, డి. నాగ మద్దయ్య, ఎం. సీతారాముడు, వి. నడిపి వెంకటేశ్వర్లు, ఎస్. వెంకటేశ్వర్లు, బి రామకృష్ణ, వై. అయ్యస్వామి, వై. పెద్ద అచ్చయ్య, రామాంజనేయులు, డి.కృష్ణ, వి.చిన్నరమణయ్య, వి. పెద్ద రమణయ్య, బి. చిన్న పుల్లయ్య, కె.శ్రీనివాసాచార్యులు, యం . రంగస్వామి, జె.చిన్నమాధవ తిరిపంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.