‘నీరు’ ఆదా చేయండి.. జీవకోటిని కాపాడండి
1 min read– భూగర్భజల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు
పల్లెవెలుగు:ప్రాణకోటికి జీవనాధారమైన నీటిని… ప్రతిఒక్కరూ పొదుపుగా వాడి ఆదా చేయాలని సూచించారు కర్నూలు భూగర్భజల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు. వేసవి కాలం కావడంతో చెరువులు… కాల్వలు ఎండిపోయాయని… ఈ క్రమంలో ఉన్న నీటి వనరును వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. శుక్రవారం కర్నూలు భూగర్భజల శాఖ కార్యాలయంలో డిడి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. నీటి పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని, లేకపోతే ఇష్టమొచ్చినట్లు వృధా చేస్తే.. భావితరాలు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సహజసిద్ధమైన నీటిని సంరక్షించడం ద్వారా ప్రాణాలను కాపాడినవారమవుతామని, వేసవిలో బంగారం కంటే విలువైనది నీరు తప్ప మరేదీ ఉండదన్నారు. దాహంతో ఉన్న మనిషికి కానీ…పశుపక్షాదులకు కానీ.. నీరు పంపిణీ చేసిన వారు దేవుళ్లతో సమానంగా చూస్తారని ఈ సందర్భంగా భూగర్భజల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస రావు నీటి యొక్క ప్రాధాన్యతను వెల్లడించారు. భావితరాలకు నీరు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.