స్కూలు బస్సు అదృశ్యం.. ఆందోళనలో తల్లిదండ్రులు !
1 min readపల్లెవెలుగువెబ్ : విద్యార్థులను తీసుకువెళుతున్న స్కూలు బస్సు కొన్ని గంటలపాటు అదృశ్యమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై లో వెలుగుచూసింది. నగరంలోని శాంతాక్రూజ్ ప్రాంతంలోని పోదార్ స్కూలు నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులతో బయలుదేరిన బస్సు నాలుగు గంటలు గడిచినా ఆచూకీ లేకుండా పోయింది. స్కూలు బస్సు డ్రైవరు ఫోన్ నంబరు స్విచ్ ఆఫ్ కావడంతో తల్లిదండ్రుల ఆందోళన పెరిగింది. విద్యార్థులున్న స్కూలు బస్సు అదృశ్యమైందనే వార్త సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోదార్ స్కూలుకు వచ్చి పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరారు. ముంబై పోలీసులు రంగంలోకి దిగి 4 గంటల తర్వాత స్కూలు బస్సు ఆచూకీని కనుగొన్నారు. స్కూలు బస్సు డ్రైవరు కొత్త వాడని, ఆయనకు రూట్ తెలియక రాంగ్ రూట్ లో వెళ్లడంతో ఆలస్యమైందని ముంబై డీసీపీ శివాజీ రాథోడ్ చెప్పారు. బస్సులో 30 మంది విద్యార్థులున్నారని వారంతా క్షేమమని, వారిని సురక్షితంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామని పోలీసులు చెప్పారు.