PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి: కలెక్టర్​ జి.సృజన

1 min read

–ఆ విధంగా ప్రజలకు అవగాహన కల్పించండి

  • పంచాయతీరాజ్​, ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులను ఆదేశించిన కలెక్టర్​ జి. సృజన

పల్లెవెలుగు, కర్నూలు: గ్రామాలలో ఒకసారి ఉపయోగించే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహన కల్పించి ఆగస్టు 15వ తేది నాటికి ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పంచాయతీ ఖాతాల్లో ఎంత నగదు ఉంది, పారిశుధ్య కార్మికులకు ఎంత మేర జీతాలు ఇస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ ఎంత మేరకు వసూలు చేశారు తదితర వివరాలను కూడా మరుసటి సమావేశానికి సిద్ధం చేయాలన్నారు. కోడుమూరు, మద్దికెర మండలాల్లో వంద శాతం క్లాప్ మిత్రాల ద్వారా పరిశుభ్ర కార్యక్రమాలు ఎలా చేపట్టారని సంబంధిత ఈఓఆర్డిలను కలెక్టర్ అడుగుగా కొంత మందికి పంచాయతీ నిధుల ద్వారా చెల్లించడం ద్వారా వారు విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, పంచాయతీ నిధుల ద్వారా ఎంత మందికి చెల్లిస్తున్నారు అనేది పూర్తి స్థాయి నివేదిక అందించాలని డిపిఓను కలెక్టర్ ఆదేశించారు. ఓడిఎఫ్ ప్లస్ కు సంబంధించి ఎన్ని ఇళ్లకు మరుగు దొడ్లు ఉన్నాయి, అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలైన సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలలో ఎన్ని మరుగు దొడ్లు ఉన్నాయి వాటిలో ఎంత శాతం వినియోగంలో ఉన్నాయి అనే వివరాలు తెలపాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)లో భాగంగా ప్రతి ఇంటి నుంచే వచ్చే డ్రై, వెట్, ప్రమాదకరమైన (హజార్డస్), ప్లాస్టిక్ వ్యర్థాల వివరాలతో పాటు గ్రామాల్లో ఉన్న సింగిల్, ట్విన్ పిట్స్ వివరాలపై డిపిఓ నివేదిక ఇవ్వాలన్నారు. గ్రామాలకు వెళ్ళినప్పుడు ముందుగా చెత్తనే ఎక్కువ శాతం స్వాగతిస్తూ ఉన్నట్లు ఉంటుందని దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని, అందుకుగాను వారంలో ప్రతి బుధవారం రోజున గ్రామాల్లోని రహదారులు, పాఠశాలలు, నీటి ట్యాంకుల దగ్గర శ్రమదాన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, ప్లాస్టిక్ ను సమర్థవంతంగా నిర్మూలించడానికి ఒకసారి ప్లాస్టిక్ వినియోగంపై గ్రామ సభల్లో తీర్మానం చేసి ఆగస్టు 15వ తేది నాటికి వాటి వినియోగం తగ్గించేలా కృషి చేయాలని ఈఓపిఆర్డిలను కలెక్టర్ ఆదేశించారు. ఫంక్షనల్ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి వాటిలో ఎన్ని వినియోగంలో ఉన్నాయి తదితర వివరాలు మరుసటి సమావేశం నాటికి అందజేయాలన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి గ్రామాలకు ఏఏ పనులు కావాలి అనేది సంబంధిత పోర్టల్ నందు వివరాలను పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయాలన్నారు. ఒకవేళ ఇంకేమైనా నమోదు చేయకుంటే శనివారం లోపు నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో పెండింగ్ ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బిల్లులు ఏవైనా ఉంటే త్వరితగతిన అప్లోడ్ చేయాలన్నారు. అదే విధంగా ఏ ఊళ్లో ఎంత మంది రెగ్యులర్ పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు వారి వివరాలు తెలపాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఎంత మేర కాలువలు ఉన్నాయో సదరు రిపోర్ట్ అందజేయాలన్నారు.

శుభ్రతకు ప్రాధాన్యమివ్వండి…!

వర్ష కాలం రానున్న నేపథ్యంలో ఎక్కువ శాతం డెంగ్యూ, మలేరియా సోకే అవకాశం ఉంటుందని, ఈ వ్యాధులకు కారణం అయ్యే దోమలు కేవలం త్రాగు నీటిలోనే ఉంటాయని, అందుకు గాను 4-5 రోజులు ఎక్కడ మంచి నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఎక్కువ శాతం కొబ్బరి బొండాలు, బకెట్స్, టైర్స్ తదితర వాటిలో నీటి నిల్వలు ఎక్కవగా ఉంటాయని అందుకు గాను పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో రెండు వందల వరకు మొక్కలు నాటడంతో పాటు జూలై 31వ తేది నాటికి లక్ష మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు, గ్రామ సర్పంచులు, ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు.

గ్రౌండ్​ వ్యాలిడేషన్​ పూర్తి చేశాం: డీపీఓ

జగనన్నశాశ్వత భూహక్కు మరియు భూరక్ష కార్యక్రమమునకు  సంబంధించి 67 ఓఆర్ఐ మ్యాప్స్ రాగా, వాటిలో 41 గ్రామాలు గ్రౌండ్ ట్రుతింగ్ చేశామని మరియు గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తి చేశామని, గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తి అయిన వాటికి డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ పబ్లిష్ చేసిన తర్వాత ఫైనల్ ఆర్ఓఆర్ ప్రాసెస్ పూర్తి చేయడం జరుగుతుందని డిపిఓ జిల్లా కలెక్టర్ జి.సృజనకు వివరించారు.

సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం, డిపిఓ నాగరాజు నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, డిఎల్పిఓలు, ఈఓఅర్డిలు, తదితరులు పాల్గొన్నారు.

About Author