నందికొట్కూరు వైసీపీలో సీటు హీటు..!
1 min readవైసీపీలో రచ్చ రేపుతున్న స్థానికత.
స్థానికేతరులకు టికెట్ పై పెరుగుతున్న అసంతృప్తి.
నందికొట్కూరు లో వైసీపీ సీటు ఎవరికి..?
టీడీపీ వైపు చూస్తున్నా వైసీపీ అసంతృప్తి వర్గం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎవరనేది ప్రజల్లో తీవ్ర ఉత్కంఠకు నెలకొంది. వైసిపి అధిష్టానం కడపజిల్లా కు చెందిన ప్రముఖ వైద్యులు డా. సుధీర్ కుమార్ కు టికెట్ ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కు వైసీపీ అధిష్టానం మొండిచేయి ఇచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే మంగళవారం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి నందికొట్కూరు టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఆర్థర్ కు టికెట్ రాకుండా సిద్దార్థ రెడ్డి అడ్డుపడుతున్నట్లు ఆర్థర్ వర్గం ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీని ఢీకొట్టాలంటే బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నియమిస్తారని పలువురు రాజకీయ మేధావులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో మంచిపట్టున్న వ్యక్తిగా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామికి పేరుంది. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కు కూడా ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అయితే అధిష్టానం ఈ ఇద్దరిలో ఎవరికి సీటు ఇస్తుందని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే ఎమ్మెల్యే ఆర్థర్ వర్గం పార్టీ ఆదేశాలనుసారంగా డా.సుధీర్ కు సపోర్ట్ చేస్తుందా లేదా! అలాగే ఆర్థర్ కు సీటు ఇస్తే సిద్దార్థ రెడ్డి క్యాడర్ పూర్తిస్థాయిలో అభ్యర్థికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రస్తుతం ఎవరికి వారే తమకే సీటు ఇస్తారంటే, లేదు తమకే సీట్ ఇస్తారంటూ క్యాడర్ చెప్పుకుంటున్నారు. అయితే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో పేరుకే తనను ఎమ్మెల్యేగా పెట్టి, పెత్తనం మొత్తం సిద్ధార్థ రెడ్డి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్థర్ వాపోతున్న సంగతి తెలిసిందే. బైరెడ్డితో ఆధిపత్య పోరు తట్టుకోలేక చేతులెత్తేశారు ఎమ్మెల్యే ఆర్థర్. ఒకానొక దశలో అధికారాలు లేని ఎమ్మెల్యే పదవి తనకు అక్కర్లేదని ఆర్థర్ అప్పట్లో రాజీనామా సైతం చేస్తాననిఅధిష్టానాన్నికి హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అధిష్టానం రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం వర్గపోరును తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే ఆర్థర్ మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయను అని స్పష్టం చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఎన్నో అలోచలనలతో తాను ఏదో చెయ్యాలని ఎమ్మెల్యేను అయ్యానని కానీ అనుకున్నది ఒకటైతే, అవుతుంది మరొకటి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఏది ఏమైనప్పటికీ తొగురు ఆర్థర్, లబ్బి వెంకట స్వామి ఇరువురికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మరి అధిష్టానం నియోజ కవర్గంలో సీటు ఎవరికిస్తుంది? వీరిలో ఒకరికి సీటు ఇస్తుందా! లేదా నూతనంగా మరెవరికైనా సీటు ఇవ్వనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.స్థానికులకు కాకుండా స్థానికేతరులకు వైసీపీ టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని వైసీపీ కార్యకర్తలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు.వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననినియోజకవర్గంలో ఆసక్తి నెలకొంది.
అయోమయంలో వైసీపీ కార్యకర్తలు..
నేతల మధ్య ఆధిపత్సపోరులో కార్యకర్తలు సమిధలవుతున్నారు. తొమ్మిదేళ్ల పాటు జెండా మోసి తీరా అధికారం వచ్చిన తరువాత పనులు చేసుకొని బాగుపడతామని ఆశించిన కార్యకర్తలకు తీవ్ర నిరాశ ఎదురవుతూనే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి .నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు ఢీ అంటే ఢీ అంటుండంతో ఎవరి వెంట వెళ్ళాలో తెలియక దిగువస్థాయి నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని మెజార్టీ వచ్చింది. అందరు ఉమ్మడిగా కష్టపడి పని చేయడం వల్లే భారీ మెజార్టీతో అభ్యర్థులు గెలుపొందారు. కాని ఇప్పుడు ఉమ్మడిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ముందుకెళుతుండడంతో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోందని, జెండా మోసిన కార్యకర్తలు కూడా ఎవరి వెంట వెళ్ళాల్లో తెలియక అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని పలువురు వాపోతున్నారు.
వైసీపీ అసంతృప్తులు టీడీపీ వైపు మొగ్గు..
వైసీపీ పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కకపోవడం, పదవుల్లోనూ అన్యాయం జరగడం, కొంతమంది సీనియర్ నాయకులు నామిటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నా, సామాజికవర్గాల లెక్కల్లో వారికి పదవులు దక్కకపోవడం ఇలా ఎన్నో కారణాలతో చాలామంది వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల నాటికి ఈ అసంతృప్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.దీనిని తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.
జనసేన, టిడిపిలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో వైసిపి లోని అసంతృప్తి నాయకులు ఇప్పుడు టిడిపి వైపు చూస్తున్నారు.వైసీపీలో సరైన ప్రాధాన్యం దక్కక అసంతృప్తి ఉన్న నాయకుల కార్యకర్తల వివరాలను ప్రస్తుతం టిడిపి సేకరిస్తోంది.టీడీపీ
పార్టీకి చెందిన కొంతమంది కీలక నాయకులను ఒక బృందంగా ఏర్పరిచి వైసిపి అసంతృప్త నాయకులను తమ దారికి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
ఇప్పటికిప్పుడు కాకపోయినా, ఎన్నికల సమయం నాటికైనా పెద్దఎత్తున వైసీపీ కీలక నాయకులు టిడిపిలో చేరుతారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.వైసీపీకి చెందిన ఐదు మంది కౌన్సిలర్లు ఇప్పటికే టిడిపి తో టచ్ లోకి వెళ్లారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి .వీరే కాకుండా మరెంతో మంది అసంతృప్త నేతలు టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తేలడంతో టీడీపీ పార్టీ వలసలపై భారీగా ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం నందికొట్కూరు నియోజకవర్గం పై దృష్టి సారించి వర్గవిభేదాల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి వైసీపీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!!