సచివాలయం..వాలంటరీ వ్యవస్థలు దేశానికే ఆదర్శం
1 min readసంక్షేమం, సుపరిపాలన, అభివృద్దే ప్రభుత్వధ్యేయం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సచివాలయం,వాలంటరీ వ్యవస్థలు దేశానికే ఆదర్శమని , ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. బుధవారం పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామంలో రెండవ రోజు నిర్వహించిన గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మూడు నెలల్లో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రజల చెంతకే పాలనను అందించారన్నారు. ఈ వ్యవస్థలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.1.30 లక్షల మందిని సచివాలయాలలో శాశ్విత ఉద్యోగాలలోనూ, 2.50 లక్షల మందిని వాలంటీర్లగా నియమించారన్నారు. సంక్షేమ క్యాలెండర్ ను ప్రవేశ పెట్టి షెడ్యూల్ ప్రకారం చెప్పినదానికన్నా ముందుగా, మిన్నగా అందచేయడం ఒక రికార్డు అని అన్నారు. అమ్మఒడి, ఫీజు రీయంబర్స్ మెంట్, ఆసరా, చేయూత, నేతన్న నేస్తం, కాపు నేస్తం, రజకులు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను అమలు చేస్తుండడం హర్షణీయమన్నారు. పథకాల అమలులో ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, కరోనా వంటి ప్రాణాంతక ఇబ్బందులు వచ్చినా ఏ పథకాన్ని నిలుపుదల చేయలేదన్నారు. ప్రజలకు పథకాలను నేరుగా చేర్పించేటటువంటి విధానాన్ని ముందెన్నడూ మనం చూడలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో 5 మందికి పైగా స్పెషలిస్టులు డాక్టర్లు పాల్గొంటున్నారన్నారు. ప్రయివేట్ హాస్పిటల్స్ లో వుండే స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఈ కార్యక్రమం చాలా బాగుందంటూ ముందుకు వచ్చి సేవలు అందిస్తుండడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి , జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు సగినేల వెంకటరమణ , వైసీపీ నాయకులు విజయుడు, శ్రీనాథరెడ్డి, ధర్మేంద్ర నాయుడు, శ్రీనివాస నాయుడు, ప్రాతకోట వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, నందికొట్కూరు మండల నాయకులు ఉండవల్లి ధర్మారెడ్డి , పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పైపాలెం ఇనాయతుల్లా , దామగట్ల రత్నం, వేల్పుల చిన్న నాగన్న, చక్రవర్తి,గౌడ్, మండల తహసిల్దార్ భారతి , అభివృద్ధి అధికారి వెంకటరమణ , వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.