రూ. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు పట్టివేత
1 min read– స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసిన సెబ్ పోలీసులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద శనివారం సెబ్ పోలీసులు రూ. కోటి 8లక్షల 61వేల 474 విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కల్లూరు చింతలముని నగర్‌కు చెందిన కేజీ సత్యనారాయణ హైదరాబాద్ నుంచి కర్నూలుకు ఎలాంటి అనుమతులు లేకుండా 1 కేజీ 818 గ్రాముల బంగారు ఆభరణాలను అద్దె వాహనంలో రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. సత్యనారాయణ ను విచారించగా.. కర్నూలు షరాఫ్ బజారులోని బిలకంటి నాగిశెట్టి బంగారు షాపులో గుమస్తాగా పని చేస్తానని, హైదరాబాద్ శ్రీబాలాజి జ్యువెలర్స్ నుంచి ఆభరణాలు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నాడు. బంగారు ఆభరణాలకు సంబంధించి ఎలాంటి ఆధార పత్రాలు లేకపోవడంతో అక్రమ రవాణాగా పరిగణిస్తూ సీజ్ చేశారు. కేసు నమోదు చేసి, బంగారు ఆభరణాలను తాలూకా పోలీసులకు అప్పగించినట్లు సీఐ లక్ష్మి దుర్గయ్య వెల్లడించారు.