PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వార్థంతో.. సీమ అభివృద్ధిని విస్మరించారు…!

1 min read

– ప్రభుత్వ, ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మవద్దు

– రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి

–ఘనంగా రాయలసీమ నామకరణ దినోత్సవం         

పల్లెవెలుగు వెబ్​: దశాబ్దాలుగా పాలకులు, ప్రతిపక్షాలు తమ రాజకీయ స్వార్థం కోసం రాయలసీమ అభివృద్ధిని విస్మరిస్తున్నాయని, వీరి మోసపూరిత వాగ్దానాలు, ప్రకటన పట్ల రాయలసీమ సమాజం అప్రమత్తంగా ఉండాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు. శుక్రవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో 94 వ రాయలసీమ నామకరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. సంస్కృతి, సామాజిక చైతన్యంతో విరాజిల్లిన రాయలసీమ,  కొందరి స్వార్థం వలన సంస్కృతి, సాంప్రదాయాలకు విఘాతం కలుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిజాం నవాబు తన అవసరాల కోసం బ్రిటిష్ పాలకులకు వదలేసిన ప్రాంతాన్ని సీడెడ్ గా (వదలివేయబడిన లేదా అనాథ  ప్రాంతంగా)  పిలువబడేదన్నారు. ఈ పేరు అగౌరవంగా ఉందని ఈ ప్రాంతాన్ని  దత్తమండలాలు అని వ్యవహరించేవారని పేర్కొన్నారు.  చారిత్రిక, సాంస్కృతికంగా విరాజిల్లిన ప్రాంతం    అనాథగా, దత్తమండలాలుగా ఉండటం సరికాదని నవంబరు 18, 1928 న నంద్యాల పట్టణంలో దత్తమండల సభ నిర్వహించి చిలుకూరి నారాయణరావు ప్రతిపాదన మేరకు ఆనాటి  ప్రముఖులు శరభా రెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, కడప కోటి రెడ్డి, ఖాదరబాదర నర్సింగ రావు, ఆత్మకూరు సుబ్రహ్మణ్యం శ్రేష్టి, రాజ సుబ్బరాయుడు శ్రేష్టి,   కె కేశన్న , ఓరుగంటి సుబ్రహ్మణ్యం, టి. రామబద్రయ్య, దాదాఖాన్ సిరాని బహుదూర్ తదతరులు  రాయలసీమ నామకరణం  నిర్ణయాన్ని సమర్థించారని వివరించారు. రాయలసీమగా ఆరోజు నుండి ఆత్మగౌరవ దీప్తిగా విరాజిల్లుతోందన్నారు. అస్తిత్వం కోసం ఉద్యమించి రాయలసీమ నామకరణంగా ఏర్పరుచుకుని ఆనాడే కోస్తాంధ్ర ప్రాంత నాయకుల వివక్షతను పప్పూరి రామాచార్యులు, కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, హలహర్వి సీతారామిరెడ్డి  తదితర ప్రముఖులు వ్యతిరేకించారని గుర్తు చేసారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడంతో ఆనాటి కోస్తాంధ్ర ప్రాంత పెద్దలకు , రాయలసీమ ప్రాంత పెద్దల మద్య రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక నవంబరు16, 1937 న  ఏర్పడిందన్నారు.  శ్రీబాగ్ ఒడంబడిక రాష్ట్ర విభజన చట్టంలోని రాయలసీమ హక్కులను పాలకులు, ప్రతిపక్షాలు విస్మరించి మభ్యపెడుతున్నాయని, మూడు పంటలు పండే పొలాలను రాజధానిగా చేసి ఆ ప్రాంత 29 గ్రామాల ప్రజలకే రాష్ట్ర ప్రజలందరి సంపదతో అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి, నివాస హక్కులు కల్పించి గత ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి తూట్లు పొడిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులంటూ ప్రస్తుత ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా రాజధాని, రైల్వే జోన్ , KRMB ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారని వివరించారు.  మనచేతనే గత , ప్రస్తుత పాలకులు “జై అమరావతి, జై పోలవరం, ప్రత్యేక హోదా, జై మూడు రాజధానులు” అంటూ అరిపిస్తున్నారన  వీరి పట్ల రాయలసీమ సమాజం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తమ రాజకీయ ఆర్థిక సామ్రాజ్యాలను నిర్మించుకోవడానికి విశాఖ, అమరావతి కేంద్రాలను ఏర్పరచుకుని మన భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయని ఆయన అన్నారు. రాయలసీమలోని మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, యువత, మహిళలు, న్యాయవాదులు, విద్యావేత్తలు బాద్యతగా రాయలసీమ భవిష్యత్తు కాపాడుకునేందుకు ముందుకు రావాలని, పాలకులను ప్రశ్నించడం రాయలసీమ ప్రజలకు నేర్పాలని బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు. రాయలసీమలోని ప్రతి గడపకు రాయలసీమలో జరుగుతున్న అన్యాయాలను వివరించేందుకు ముందుకు సాగుతున్నామని ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  అనంతరం రాయలసీమ నామకరణాన్ని పురష్కరించుకుని మిఠాయిలు పంచిపెట్టారు. రాఘవేంద్ర గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సాగు నీటి సాధన సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, రిటైర్డ్ ఆంధ్రా బ్యాంక్ AGM శివనాగిరెడ్డి,  విశ్వహిందూ పరిషత్ నంద్యాల జిల్లా ప్రముఖులు యర్రం విష్ణువర్ధన్ రెడ్డి, RSS నంద్యాల జిల్లా ప్రముఖ్  మనోహర్, ముస్లిం మైనారిటీ నాయకులు సౌదాగర్ ఖాసీం మియా, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు షణ్ముఖరావు, రిటైర్డ్ డిప్యూటీ DEO  బ్రహ్మానందరెడ్డి, పట్నం రాముడు, మహేశ్వరరెడ్డి, కొమ్మా శ్రీహరి, ఏరువ రామిరెడ్డి, రిటైర్డ్ BSNL ఇంజనీర్ వెంకటసుబ్బయ్య, M.V.రమణారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, రాఘవేంద్ర గౌడ్,  సుదర్శన కుమార్, భాస్కర్ రెడ్డి, సత్యనారాయణరెడ్డి, తిరుపాల్ యాదవ్  తదితరులు పాల్గొన్నారు.

About Author