సీనియర్ నటి జయంతి ఇకలేరు
1 min readసినిమా డెస్క్ : జయంతి అంటే సూపర్‌స్టార్ రజినీకాంత్, మోహన్‌బాబు కలిసి నటించిన పెదరాయుడు సినిమా గుర్తొస్తుంది ఎవరికైనా. అంతగా గుర్తుండిపోయింది ఆ సినిమాలోని ఆమె నటన. లెజండరీ యాక్టర్స్‌తో నటించిన సీనియర్ నటి జయంతి (76) ఇకలేరు. ఆమె నిన్న కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. నిన్న ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన జయంతి, 1963లో కన్నడ సినిమా ‘జెనుగూడు’తో తన కెరీర్ ప్రారంభించారు. సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు కలమలకుమారి. మొదటిసారి ఆమెకి అవకాశం ఇచ్చిన దర్శకుడు వై.ఆర్.స్వామి తన పేరుని జయంతిగా మార్చారు. రెండో సినిమాకి రాజ్ కుమార్‌కి జంటగా నటించిన ఆమె, ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో రాజ్ కుమార్ కాంబినేషన్ లో ముప్పై చిత్రాల్లో ఆమె నటించారు. అంతేకాదు తెలుగు, తమిళ భాషల్లో ఆమె ఎన్టీఆర్, ఎంజీఆర్, జెమినీ గణేషన్, జై శంకర్ మొదలైన స్టార్స్‌తో నటించారు ఆమె. దక్షిణాది భాషలతో పాటు హిందీ, మరాఠీ భాషల్లో కలిపి 500లకు పైగా చిత్రాల్లో నటించిన జయంతి జగదేక వీరుడి కథ, బొబ్బిలి యుద్ధం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, కులగౌరవం, డాక్టర్ చక్రవర్తి, దొంగ మొగుడు, పెదరాయుడు లాంటి పలు తెలుగు సినిమాల్లో నటించారు. డైరెక్టర్ పేకేటి శివరాంతో ఆమె వైవాహిక జీవితం గడిచింది. ఏడుసార్లు ఆమె కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్నారు. ‘అభినయ శారద’ అనే బిరుదుతో కన్నడ సినిమా ఇండస్ట్రీ ఆమెను సత్కరించింది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో, 1999 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీచేసి ఓడిపోయారు. జయంతి మరణానికి తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.