వివేక హత్య కేసులో సంచలనం.. కీలక విషయాలు బహిర్గతం !
1 min readపల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో వివేకా వద్ద డ్రైవర్ గా పనిచేసిన షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారారు. ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో, 25న సీబీఐ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ కుటుంబ సభ్యులైన వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డిల పాత్ర ఉందని ఎర్రగంగిరెడ్డి తనకు చెప్పినట్టు షేక్ దస్తగిరి వాంగ్మూలంలో తెలిపారు. హత్య చేస్తే డి. శంకరెడ్డి 40 కోట్లు ఇస్తారని, 5 కోట్లు తనకు ఇస్తానని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్టు షేక్ దస్తగిరి వెల్లడించారు. హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత తనకు సునీల్ కోటి రూపాయలు ఇచ్చారని, అందులో 25 లక్షలు మళ్లీ ఇస్తానని తీసుకున్నాడని చెప్పారు. హత్యలో ఎర్రగంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. సీఆర్ పీసీ 164(1) ప్రకారం దస్తగిరి ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు.