తెలుగుగంగ లైనింగ్ పనులలో తీవ్ర జాప్యం..
1 min read– రోళ్లపాడు లో రెండు వేల ఎకరాల సాగు ప్రశ్నార్థకం.
– మూడేళ్లుగా పూర్తికాని తెలుగుగంగ లైనింగ్ పనులు.
– అడుగంటిన భూగర్భ జలాలు..ఎండిపోయిన బోర్ బావులు..
– రోళ్ళ పాడు గ్రామంలో సాగు తాగునీటికి కటకట..
– లైనింగ్ పనులను నిర్లక్ష్యంగా చేస్తున్న ఏ కె ఆర్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
– అధికారులు చర్యలు తీసుకోవాలని రోళ్లపాడు రైతుల ఆందోళన.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలంలోని రోల్లపాడు గ్రామ సమీపంలో తెలుగుగంగ ఎడమ గట్టు కాలువ ఆధునీకరణ పనులలో భాగంగా సిమెంట్ బెడ్, సిమెంట్ లైనింగ్ కాంక్రీట్ పనులు చేపట్టి మూడేళ్లు గడుస్తున్న కంపెనీ యాజమాన్యం నత్త నడకన పనులు చేస్తుండడంతో రోళ్ళపాడు గ్రామస్తులకు తాగు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆదివారం గ్రామ సర్పంచ్ రామస్వామి రెడ్డి ఉప సర్పంచ్ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుగంగ కాలువ వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాలువ లైనింగ్ పనులను నిర్వహిస్తున్న ఏ కెఆర్ కంపెనీ యాజమాన్యం పనులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయవన్నారు. గ్రామానికి చెందిన రైతులు దాదాపు 2000 ఎకరాలలో సాగు చేస్తున్న పంటలకు బోరుల ద్వారా నీరు అందే పరిస్థితి లేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే గ్రామ సమీపంలో కెనాల్ ఉండడంతో తాగునీటి బోర్ల ద్వారా నీరు అందే పరిస్థితి లేక తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. లైనింగ్ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ ఊట నీటిని సైతం ట్రాక్టర్ల పంపుల ద్వారా బయటకు తోడివేస్తున్నడంతో బోర్లలో చుక్కనీరు లేక పోవడంతో ప్రస్తుతం రైతులు సాగు చేసిన రెండు వేల ఎకరాల పంటలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మూడు వేల జనాభా ఉందని గ్రామానికి సాగునీరు అందించేందుకు పది బోర్లను వేయడం జరిగిందని అయితే లైనింగ్ పనుల కారణంగా బోర్లలో చుక్కనీరు లేకుండా ఎండిపోయాయని దీంతో తాము తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల సాగు, తాగునీటి ఎద్దడి పై జిల్లా అధికారులు ,ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే ఎస్సార్ బీసీ లైనింగ్ పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆందోళన చేపట్టవలసి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు ,గ్రామస్తులు రాఘవేంద్ర, శ్యాం పుల్లయ్య,మదన శేఖర్ ,సంజీవ రాయుడు, వెంకటేశ్వర గౌడ్, నాయుడు, రాయుడు, రమేష్, మైరవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.