నందికొట్కూరు మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ గా షేక్ రహత్..
1 min read– వైస్ ఛైర్మన్ గా శాతనకోట షరీఫ్ బాష.
– 48 ఏళ్ల చరిత్రలోనే మహిళకు మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం.
– నందికొట్కూరు నియోజకర్గంలో సంచలనం..
– అట్టహాసంగా ప్రమాణ స్వీకారం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం తొలిసారిగా బీసీ కేటగిరీలో నందికొట్కూరుకు చెందిన షేక్ రహత్ కు వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. 48 ఏళ్ల చరిత్రలో చైర్మన్ పదవి మహిళకు వైసీపీ ప్రభుత్వం కేటాయించడంతో వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు . నాలుగు దశాబ్ధాలకు పైగా చరిత్ర ఉన్న మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి మహిళకు కేటాయించారనే సమాచారం నందికొట్కూరు నియోజకవర్గంలో సంచలనంగా మారింది .1975 లో మార్కెట్ యార్డు ఏర్పాటైనప్పటి నుంచి పురుషులు మాత్రమే చైర్మన్ పీఠం అధిరోహించారు .మొట్ట మొదటిసారి మహిళకు చైర్మన్ పదవి దక్కడం విశేషం .మార్కెట్ యార్డ్ ఆరంభం నుంచి నేటి వరకు చైర్మన్ కుర్చీలో నందికొట్కూరు, మిడుతూరు మండలానికి చెందిన నేతలే కూర్చుంటూ వచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 9 మంది చైర్మన్ పదవి చేపట్టారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది రెడ్డి సామాజిక వర్గం నుంచి చైర్మన్ పదవి చేపట్టగా ఒకే ఒక్కరు బిసి సామాజిక వర్గం నుంచి చైర్మన్ పదవి చేపట్టారు.1976 లో మొట్ట మొదటిసారిగా మాద్దురు సుబ్బారెడ్డి మద్దతు దారుడు ప్రాతకోట వేణుగోపాల్ రెడ్డి చైర్మన్ పదవి చేపట్టారు. ఆతర్వాత ఐదు ఏళ్ళు ప్రత్యేక అధికారుల పాలన సాగింది. అనంతరం మళ్ళీ మాద్దురు సుబ్బారెడ్డి వర్గానికి చెందిన సావూరు సన్నప్ప మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి చేపట్టారు. కొన్ని రాజకీయ కారణాల రిత్యా సంజీవ రెడ్డి 20 రోజులు చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టారు.1987నుండి 1997 వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. అనంతరం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1997 లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గానికి చెందిన గుండం నాగేశ్వర రెడ్డి, 2000 సంవత్సరం లో చల్లా సుభాష్ చంద్రబోస్ రెడ్డి లు చైర్మన్ పదవి అలంకరించారు. 2006లో గౌరు వెంకట రెడ్డి వర్గానికి చెందిన కస్వా శంకర్ రెడ్డి, 2013లో లబ్బి వెంకటస్వామి మద్ధతుదారుడు మురళీమోహన్ రెడ్డి, 2015 లో మాండ్ర శివానంద రెడ్డి మద్దతుదారుడు గుండం రమణా రెడ్డి, 2020లో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మద్దతు దారుడు తువ్వా శివరామ కృష్ణా రెడ్డి చైర్మన్ పదవి చేపట్టారు. నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానం శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వర్గానికి వరించడంతో నియోజకవర్గంలో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 15మంది కమిటీ సభ్యులు జాబితా ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ సభ్యులలో ఎనిమిది మంది పురుషులకు ఏడు మంది మహిళలకు అవకాశం కల్పించారని తెలుస్తోంది .గతంలో ఓసీ సామాజికవర్గానికి చెందిన తువ్వా శివ రామ కృష్ణా రెడ్డి రెండేళ్ళ పాటు చైర్మన్ గా పదవిలో ఉన్నారు. ఆ పాలకవర్గం గడువు గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.రెండు మూడు రోజులలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.