షోకాజ్ నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి
1 min read– ఏపీటీఎఫ్
పల్లెవెలుగు వెబ్ గడివేముల: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఉపాధ్యాయ సంఘ నేతలకు నిరంకుశంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వము జారీచేసిన షోకాజ్ నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎస్. మహబూబ్ బాషా ,రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బి. మాధవస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గడివేములలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ జి. హృదయ రాజు గారికి, పూర్వపు మాజీ ప్రధాన కార్యదర్శి మరియు పశ్చిమ రాయలసీమ ఎన్నికల కన్వీనర్ కె.కులశేఖర్ రెడ్డి గారికి సోదర సంఘూల రాష్ట్ర నాయకులకు అన్యాయంగా, అక్రమంగా షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. కావున షోకాజ్ నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం మద్దతిస్తున్న అభ్యర్థిని గెలిపించుకోవడానికి అక్రమ మార్గంలో కుట్రలు చేస్తూ వ్యతిరేక అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉపాధ్యాయ సంఘ నాయకులకు, ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ, సస్పెన్షన్ చేస్తామని బెదిరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అప్రజాస్వామ్య పద్ధతిలో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించడం సిగ్గుచేటయిన విషయమని .షోకాజ్ నోటీసులకు భయపడే ప్రసక్తి లేదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమాలు చేయక తప్పదన్నారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆవుల మునిస్వామి, జిల్లా కౌన్సిలర్లు ఎ. నాగన్న, వి. సుబ్బరాయుడు, గడివేముల మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ .బాలస్వామి, మానపాటి రవి , రవీంద్ర నాయక్, నాగ శేషన్న తదితరులు పాల్గొన్నారు.