అడా చైర్మన్గా సింగసాని గురుమోహన్
1 min read– అట్టహాసంగా ప్రమాణస్వీకారోత్సవం
– శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు
పల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో: కష్టపడి పని చేసే కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తారని, ఇందుకు తమ పదవులే నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్బాష అన్నారు. కింది స్థాయి నుంచి ఎదిగిన గురుమోహన్ ..అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థ (అడా) చైర్మన్ గా ఎన్నిక కావడం ప్రశంసనీయమన్నారు. శనివారం కడప నగర శివారులోని మాధవి కన్వెన్షన్ హాల్లో అడా చైర్మన్గా గురు మోహన్ ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ అంజాద్బాష, కడప పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘునాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి,రాజంపేట మాజీ శాసన సభ్యుడు అమర్ నాథ్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన గురు మోహన్ అడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. ఎనిమిది మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లు, 31 మండలాల పరిధిలో ఉన్న ఈ సంస్థ అభివృద్ధికి, నిధుల మంజూరుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. అంతకుముందు వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అడా.. అభివృద్ధికి కృషి చేస్తా…
అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమ, నిబంధనలకు లోబడి శ్రద్ధతో పని చేస్తానని సింగసాని గురుమోహన్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడా సంస్థ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ పదవి దక్కడానికి జిల్లా నుంచి కృషి చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అడా చైర్మన్ గా ఎన్నికవడం పై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు వెంకటసుబ్బయ్య భార్య సుధ,మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి,కడప మున్సిపల్ కార్పోరేషన్ లవన్న, బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, బద్వేల్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.