సింగర్ కేకే హఠాన్మరణం !
1 min readపల్లెవెలుగువెబ్ : సింగర్ కేకే అలియాస్ కాయ్ కాయ్ అలియాస్ కృష్ణకుమార్ కున్నాత్(53) మంగళవారం రాత్రి కోల్‌కతా ప్రదర్శన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త సినీ ప్రపంచంతో పాటు ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బాలీవుడ్‌తో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ, మలయాళంలోనూ 800 దాకా పాటలు పాడారు. కేకే అడ్వర్టైజ్మెంట్ జింగిల్స్‌తో సింగింగ్ కెరీర్ ప్రారంభించారు. దాదాపు పదకొండు భాషల్లో 3,500 యాడ్స్‌కు ఆయన వాయిస్ ఇచ్చారంటే అతిశయోక్తి కాదు. సింగర్ కేకే.. 90వ దశకంలో నుంచి వింటున్న పేరు. 1994లో లూయిస్ బాంక్స్, రంజిత్ బారోత్, లెస్లే లూయిస్ వల్ల సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడాయన. యూటీవీ వారి సింగ్ జింగిల్స్‌తో ఆయనకు బ్రేక్ దక్కింది. లెస్లే లూయిస్‌ని గురువుగా భావిస్తారాయన. కానీ, సినీ ప్రపంచంలో పాపులర్ అయ్యింది మాత్రం ఏఆర్ రెహమాన్ ద్వారానే. బాలీవుడ్‌లో ఆయన వందల్లో పాటలు పాడారు. కేవలం ఏ ఒక్క నటుడికో తన గాత్రం సరిపోతుందనే ఉద్దేశం ఆయనకు ఏమాత్రం ఉండేది కాదు. అందుకే చిన్నా పెద్దా నటులందరి పాటలకు గాత్రం అందించారు.