ధూమపానం.. మధుమేహం.. ఇవే గుండెకు శత్రువులు
1 min read* ఆహారపు అలవాట్లనూ క్రమబద్ధీకరించుకోవాలి
* కర్నూలు కిమ్స్ ఆస్పత్రి కార్డియాలజిస్టు డాక్టర్ నాగేంద్రప్రసాద్
* నేడు ప్రపంచ గుండె దినోత్సవం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మన గుండెను పదిలంగా చూసుకోవాలని.. దానికి ప్రధాన శత్రువులైన ధూమపానాన్ని పూర్తిగా వదిలేయడం, మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడం ముఖ్యమని కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ నాగేంద్రప్రసాద్ చెప్పారు. శుక్రవారం ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. గుండెకు సంబంధించిన వ్యాధులు ఫలానా వయసులోనే రావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏ వయసువారికైనా రావొచ్చని, అందువల్ల వాటి లక్షణాలను గమనించుకుంటూ దాని గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రధానంగా మద్యపానం, ధూమపానం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం గుండెవ్యాధులకు కారణాలవుతున్నాయని వివరించారు. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, పామోలిన్ ఆయిల్ లాంటి శాచ్యురేటెడ్ నూనెల వాడకం వల్ల గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు తాము గుర్తించామన్నారు. నగరాలతో పోలిస్తే ఈ ప్రాంతంలో ఆహారపు అలవాట్ల మీద అవగాహన కొంత తక్కువగా ఉన్నట్లు గమనించామని.. దీనిపై అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగించే అంశాల గురించి తెలుసుకోవాలని.. ముఖ్యంగా ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉంటూ.. ఆహారంలో కూడా ఉప్పు వాడకం గణనీయంగా తగ్గించాలని సూచించారు. గుండె ఆరోగ్యం గురించి బాగా ప్రచారం చేసి, పెద్ద ఎత్తున స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు.
90% గుండె చికిత్సలు ఆరోగ్యశ్రీలోనే…
కర్నూలు కిమ్స్ ఆస్పత్రి ప్రధానంగా ఈ ప్రాంతంలోని పేద రోగుల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో ముందడుగు వేస్తోంది. ఇక్కడ నిర్వహిస్తున్న గుండె చికిత్సలన్నింటిలో 90% ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితంగా చేస్తున్నారు. మిగిలిన 10% మాత్రమే నగదు లేదా బీమా రూపంలో జరుగుతున్నాయి.