NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్నేహమా..కుశలమా..

1 min read

– చదివిన బడిలో 30 ఏళ్లకు కలయిక
పల్లెవెలుగువెబ్​, చాగలమర్రి: చాగలమర్రి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర బాలుర ఉన్నత పాఠశాల 1991-92 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు బుధవారం తాము చదువుకున్న పాఠశాలలో సమావేశమయ్యారు . కర్నూలుతోపాటు అనంతపురం , హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో స్థిరపడిన దాదాపు వంద మంది పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు . దాదాపు 30 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో స్నేహితులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పరవశించిపోయారు. ఆనాడు గురువులు కొట్టిన బెత్తం దెబ్బలను , గోడ కుర్చీలను గుర్తుకు తెచ్చుకున్నారు . చదువుకునే రోజుల్లో తరగతి గదుల్లో పిలుచుకునే మారుపేర్లను తలుచుకున్నారు . అందరూ ఆనంద సాగరంలో మునిగి తేలారు . మూడు దశాబ్దాల క్రితం నాటి మిత్రులు ఆలింగనం చేసుకుని ఆనంద భాష్పాలు రాల్చారు . పోటా పోటీగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. అనంతరం తమ పూర్వపు ఉపాధ్యాయులైన మధుసూదన్‌శర్మ, వెంకటరెడ్డి, బాలమున్నయ్య, నరసింహుడు ఘనంగా సన్మానించి వారిచే మెమంటోలను అందుకున్నారు. అలాగే వివిధ కారణాలచే మృతి చెందిన తమ తోటి ఎనిమిది మంది పూర్వపు విధ్యార్థులకు ఘనంగా శ్రధ్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మల్లికార్జున, సుబ్బయ్య, సుబ్బమల్లేశ్వరరావు, అమీర్‌, మహమ్మద్ రఫి,ఆంజనేయులు,కవితాస్వరూప,చక్రం బీడి షబ్బీర్‌, సర్తాజ్‌, రహంతుల్లా, కృష్ణవేణి, ప్రతాప్‌రెడ్డి, నాగరాజు, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

About Author