ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో సమస్యలు పరిష్కరించండి
1 min read– పారిశుద్ధ చర్యలు ముమ్మరం చేయండి
– జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ నిశాంతి.టి
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులపై సత్వరమే స్పందించి ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నిశాంతి.టి, ఇంచార్జి డిఆర్ఓ కామేశ్వరరావు తదితరులు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ స్పందన ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై సత్వరమే స్పందించి నాణ్యతతో ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. స్పందన సమస్యలను మొక్కుబడి రీతిలో పరిష్కరించకుండా నాణ్యతతో పరిష్కార మార్గాలు చూపాలన్నారు. ప్రజలు అసంతృప్తి చెందకుండా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మున్సిపల్ పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య చర్యలు ముమ్మరం చేసి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే వసతి గృహాల్లో కూడా పారిశుధ్య చర్యలు పాటిస్తూ విద్యార్థుల్లో రక్తహీనత అధిగమించేందుకు మెనూ ప్రకారం పోషకాహారంతో కూడిన ఆహార పదార్థాలను అందజేయాలన్నారు. వసతి గృహాలను హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తరచూ తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. వడగాల్పులపై ప్రజల అప్రమత్తమయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు సమకూర్చాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు
1)కొత్తపల్లి మండలం గుమ్మడాపురం గ్రామ కాపురస్తురాలు జి.భారతి ని తన భర్త వదిలి 15 సంవత్సరాలు అయిందని….తనకు ఇద్దరు కుమార్తెలు వున్నారని వారిని పోషించకుండ నా భర్త రెండవ పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడని ఇటీవల నా రెండవ కుమార్తె డెంగ్వూ జ్వరం వచ్చి మరణించిందని నా జీవనం చాలా కష్టంగా ఉన్నదని… ఏ ఆధారమూ లేని నాకు ఎక్కడైనా హాస్టల్ నందు ఖాళీగా వున్న కమాటి పోస్ట్ ఇప్పించిగలరని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు. 2)కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో ఎస్సీలైన మేము గత కొన్నేళ్లుగా చెన్నకేశవ దేవాలయ మాన్యంలోని కొండ భాగంలో స్మశానంగా వినియోగిస్తున్నామని… ప్రస్తుతం మా స్మశానంలోని సమాధులు తీసివేసి శుభ్రం చేసుకొని పొలం వేసుకోవాలి అని చెప్పుతూమా కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని… ఎస్సీలైన మాకు స్మశానం లేకుండా చేస్తున్నారని ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు. 3)నంద్యాల పట్టణ వాస్తవ్యురాలు రాధమ్మ తన తండ్రి అనారోగ్యంతో శాంతిరాం హాస్పిటల్ లో చికిత్స చేయించానని EHS కార్డ్ ద్వారా వినియోగానికి వెసులుబాటు కల్పిస్తూ ఖర్చు చేసిన మొత్తాన్ని ఇప్పించగలరు . ఇంకా ఈ కార్యక్రమంలో 175 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.