ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధి:సీపీఐ
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ: ప్రజా సమస్యల పరిష్కారానికి భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రామచంద్రయ్య స్పష్టం చేశారు. సోమవారం స్థానిక గోపాల్ ప్లాజాలో సిపిఐ పత్తికొండ నియోజకవర్గ స్థాయి 13 వ మహాసభలు జరిగాయి. ఈ సభలకు ముఖ్యఅతిథిగా హాజరైన పి రామచంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలం చెందాయన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారమే పరమావధిగా మత రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ, లౌకిక వాదాన్ని ధ్వంసం చేస్తున్నాడని అన్నారు. హిందు రాజ్యస్థాపన కోసం బిజెపి దేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మత శక్తులు పెట్రేగి పోతున్నాయని, ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతుందని అన్నారు. ఈ కారణంగా రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. సంక్షేమం పేరిట ఇబ్బడిముబ్బడిగా తెచ్చిన అప్పులు రాష్ట్ర ప్రజలపై పెను భారంగా మారాయి అని ఆందోళన చెందారు. ప్రజా సమస్యలను విస్మరించి అధికారమే పరమావధిగా జగన్ మోహన్ రెడ్డి పాలన చేస్తున్నాడని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య అన్నారు. మూడు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలపై అనేక భారాలు వేశాడని తెలిపారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి అని, దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రజాకంఠక ప్రభుత్వాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలకు సమాయత్తం అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.