శివదీక్షా విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు
1 min readపల్లెవెలుగు వెబ్: జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వెలిసిన శ్రీశైలంలో శివస్వాములు దీక్షా విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈఓ లవన్న. ఈ దీక్షావిరమణను పురస్కరించుకుని ఉదయం స్వామివారి ఆలయ దక్షిణద్వారం వద్ద శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులైన తరువాత విశేష పూజలు జరిపించబడ్డాయి. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లను రథవీధిలో మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి శివదీక్ష శిబిరాలలో వేంచేబు చేయించడం జరిగింది. అనంతరం దీక్షా శిబిరాలలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారలతో పూజాదికాలు నిర్వహించబడ్డాయి. శివదీక్షా విరమణ కార్యక్రమం పూర్తి అయ్యేంతవరకు కూడా శిబిరాలలోని దేవతా మూర్తులకు త్రికాలలో శాస్త్రోక్తంగా పూజాదికాలు జరుపబడతాయి. అనంతరం దీక్షా శిబిరాలలోని హోమగుండానికి అర్చకస్వాములు శాస్త్రోక్తంగా పూజలను జరిపించి హోమాగ్నిని ప్రజ్వలింపజేశారు. తరువాత శివదీక్షాదారులు నమశ్శివాయ పంచాక్షరీ నామస్మరణతో శివదీక్షా విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దీక్షా విరమణ చేసే భక్తులంతా శ్రీస్వామివారికి జ్యోతిర్ముడిని సమర్పిస్తున్నారు. జ్యోతిర్ముడి సమర్పణానంతరం ఆవునెయ్యి, నారికేళం మొదలుగా గల ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా భక్తులు సమర్పించడం జరుగుతోంది.
మాలధారులకు ప్రత్యేక దర్శనం…
కాగా శివదీక్షను స్వీకరించిన భక్తులకు చంద్రవతి కల్యాణమండపం నుండి ఆలయ తూర్పు మాడవీధి ద్వారా ప్రత్యేక దర్శనము క్యూలైన్ ద్వారా నిర్ణీత వేళలో స్వామివార్ల దర్శనం కల్పించబడుతుంది. అధిక సంఖ్యలో దీక్షావిరమణ చేసే భక్తుల కోసం మూడు వంతులుగా పలువురు సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించబడ్డాయి. ఈ సిబ్బంది అంతా శివదీక్షా శిబిరాలలో నిరంతరం ప్రత్యేక విధులు నిర్వహిస్తారు.