PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం గ్రామ దేవత అంకాళమ్మకు శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం అమ్మవారికి దేవస్థానం సేవగా ( సర్కారి సేవ)గా విశేష పూజలు చేశారు. అంకాళమ్మ ఆలయం.. ప్రధాన ఆలయానికి ఎదురుగాగల రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది. ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని దేవీభాగవతంలో చెప్పబడింది. ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. దైవశక్తి సమాజంలో ఏదో కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని తెలియజెప్పే మన విశిష్ట సంస్కృతి యొక్క ఉదాత్త వైఖరికి తార్కాణంగా ఈ గ్రామదేవత ఆరాధనను పేర్కొనవచ్చు. కాగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ జరిపించబడింది. ఆ తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అభిషేకం పూజలను నిర్వహించబడ్డాయి. అర్చకస్వాములు కోవిడ్ నిబంధనలతో భౌతికదూరాన్ని పాటిస్తూ అంకాళమ్మ అమ్మవారికి ఈ విశేషార్చనలు నిర్వహించారు అని ఈఓ రామా రావు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author