నారా లోకేష్ పాదయాత్ర కోసం ప్రత్యేక పూజలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ, అలాగే ఆయన ఆరోగ్యం బావుండాలని కోరుతూ నగరంలోని సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయకుని ఆలయంలో తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ టీజీ భరత్ లతోపాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో పూజల అనంతరం నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ కొబ్బరికాయలు కొట్టారు .ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ టీజీ భరత్ తదితరులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27వ తేదీ నుంచి పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. ఈ పాదయాత్ర 400 రోజులపాటు కొనసాగుతుందని, మొత్తం నాలుగు వేల కిలోమీటర్లు యువ నేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తారని వారు వివరించారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ నగరంలోని అన్ని ప్రముఖ దేవాలయాలలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం నగరంలోని శ్రీ రుక్మిణి సమేత శ్రీ కృష్ణ మందిరంలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ,కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో పూజల అనంతరం నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ టెంకాయలను కొట్టారు.