దత్తాత్రేయస్వామికి విశేషపూజలు
1 min readపల్లెవెలుగువెబ్, శ్రీశైలం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద వేంచేబు చేసిఉన్న శ్రీ దత్తాత్రేయస్వామి కి సర్కారీ సేవగా గురువారం విశేష పూజలు నిర్వహించారు. ముందుగా మహాగణపతి పూజ అనంతరం దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. లోకోద్ధరణకోసమై బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు. కాగా శ్రీశైలక్షేత్రానికి దత్తాత్రేయుల వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు. అర్చకస్వాములు కోవిడ్ నిబంధనలతో భౌతికదూరాన్ని పాటిస్తూ దత్తాత్రేయస్వామివారికి ఈ విశేషార్చనలు నిర్వహించినట్లు ఆలయ ఈఓ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.