PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శనకు విశేష స్పందన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఎంతోమంది త్యాగాధనుల నిస్వార్థ సేవా ఫలమే నేడు మనమంతా స్వేచ్ఛగా ఉండగలిగే వాతావరణానికి నాంది అని కర్నూలు శాసనసభ్యులు ఎం.ఏ.హాఫీజ్ ఖాన్ అన్నారు, ఆయన నేడు ఉస్మానియా కళాశాలలో ఏర్పాటుచేసిన ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శనను ప్రారంభించి, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో కుల మతాలకతీతంగా ప్రజలందరూ ఐక్యంగా నడిచారని, చాలామంది ముస్లింలు తమ ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం త్యాగం చేశారని, కొందరు కుటుంబాలను పోగొట్టుకుంటే ,మరికొందరు తమ ఆస్తిపాస్తులన్నింటిని దేశం కోసం అర్పించేశారని తెలిపారు. ఈ స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను సేకరించడంలో  ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నశీర్ అహ్మద్ గారి కృషి ప్రశంసనీయమైనదని తెలిపారు.సయ్యద్ నశీర్ అహ్మద్ మాట్లాడుతూ తాను కేవలం 310 మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు వారి చరిత్రను మాత్రమే సేకరించగలిగానని కొన్ని వేల మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చరిత్ర మరుగున పడిపోయిందని, వాటిని వెలికి తీసి నేటి తరానికి అందచేయవలసిన బాధ్యత చరిత్ర అధ్యాపకులపై ఉందని అన్నారు.ఉస్మానియా కళాశాల కార్యదర్శి మరియు కరస్పాండెంట్ శ్రీమతి.అజ్రాజావేద్ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులలో జాతీయ భావన పెంపొందించడానికి తోడ్పడతాయని, గత చరిత్రను తెలుసుకోవడంలో ఆసక్తిని పెంచుతాయని తెలిపారు. ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్ , సయ్యద్ సమీవుద్దీన్ ముజమ్మిల్ మాట్లాడుతూ చరిత్ర కేవలం రాజులు సైనికులదే కాదని, దేశభక్తులైన ప్రజల త్యాగాలను విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.ప్రదర్శనను ఏర్పాటు చేసిన చరిత్ర శాఖాధ్యక్షులు షేక్ మసూద్ అహ్మద్, చరిత్ర అధ్యాపకులు డాక్టర్.ఎస్ఎం గులాం హుస్సేన్ ఈ చిత్రపటాల ప్రాముఖ్యతను, అందులో ఏర్పాటుచేసిన స్వాతంత్ర సమరయోధుల విశేషాలను తెలియజేశారు. కర్నూలు జిల్లాకు చెందిన సయ్యద్ షా ఖాద్రి బియాబాని, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి, గాంధీ గారి పిలుపుమేరకు తన 15 ఎకరాల భూమిని ఉచితంగా పేదలకు పంచి, స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని కూడా గడిపారని తెలిపారు. అలాగే 1823లో కర్నూలు నవాబుగా ఉన్న గులాం రసూల్ ఖాన్ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, 1939లో గులాం రసూల్ ఖాన్ ఆంగ్లేయుల సైన్యంతో పోరాటం చేస్తూ వారికి దొరకగా, ఆంగ్లేయులు గులాం రసూల్ ఖాన్ తిరుచునాపల్లి కారాగారంలో బంధించి అతడిని అక్కడే కుట్ర చేసి చంపారని తెలిపారు.. ఇలాంటి ఎంతోమంది ముస్లిం స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం తమ కుటుంబాలను, తమ ప్రాణాలను, ఆస్తిపాస్తులను తృణప్రాయంగా అర్పించేశారని స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. ఉస్మానియా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ ఏ ఎం ఘజనీ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.కరీముల్లా ఖాన్ మొదలైన వారు పాల్గొన్నారు.ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను చూడటానికి ఉస్మానియా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులే కాకుండా కర్నూలు నగరంలోని పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు అసంఖ్యాకంగా ఇచ్చేశారు. గాడి చర్ల ఫౌండేషన్ అధ్యక్షులు కురాడి చంద్రశేఖర కల్కూర, సిల్వర్ జూబ్లీ కళాశాల చరిత్ర శాఖ అధ్యక్షులు రెడ్డి ప్రసాద్ రెడ్డి, ప్రముఖ రచయితలు ఇనాయతుల్ల ,అబ్దుల్ అజీజ్ ప్రదర్శనను  సందర్శించిన వారిలో ఉన్నారు.

About Author