మూడు రోజులపాటు క్రీడోత్సవాలు..
1 min read–శాంతిక పోతాన్ని ఎగరవేసి టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్.ఈ జి శ్యాంబాబు
– ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో రాణించాలి : సిఎండి కె.సంతోష్ రావు
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : నిరంతరం శ్రమిస్తున్న విద్యుత్తు ఉద్యోగ,కార్మికులకు క్రీడలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని ఏపీ ఈపీడీసీఎల్ సిఎండి కె సంతోష రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ టోర్నమెంట్ ను మంగళవారం ఏలూరులోని సిఆర్ రెడ్డి క్రీడా మైదానంలో సిఎండి సంతోష రావు ప్రారంభించారు.ఏపీ ఈపీడీసీఎల్,ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సీపీడీసీఎల్,ట్రాన్స్కో,జెన్కో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20 తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్ కు ఏపీ ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ ఆతిథ్యం ఇచ్చింది.టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎండి సంతోషరావు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని,క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో రాణించాలని సూచించారు. మూడు రోజులు పాటు పండుగ వాతావరణంలో జరిగే కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొని మానసిక ఉల్లాసం పొందాలన్నారు. మరింత ఉత్సాహంతో వినియోగదారులకు ఉత్తమమైన సేవలు అందించి ప్రభుత్వంతోపాటు ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఏలూరు సర్కిల్ ఎస్ఇ జి శ్యాంబాబు మాట్లాడుతూ ఎండనక, వాననక, తుఫాన్లను సైతం లెక్కచేయకుండా నిరంతరం శ్రమిస్తున్న విద్యుత్ ఉద్యోగులకు క్రీడల వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుందన్నారు. కరోనా సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైన సమయంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలు అందించి ప్రజాభిమానం పొందారని చెప్పారు. అనంతరం సిఎండి సంతోష రావుతో కలిసి ఎస్ఇ జి శ్యాంబాబు శాంతికపోతాన్ని ఎగరేసి కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించారు. తొలుత క్రీడాకారుల గౌరవ వందనాన్ని సిఎండి సంతోషరావు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్ రెడ్డి కళాశాల కార్యదర్శి ఎంబిఎస్వి ప్రసాద్, కరస్పాండెంట్ కే విష్ణు మోహన్, ప్రిన్సిపల్ రామరాజు, డిఈ టి శశిధర్, ఏడిఈలు కృష్ణరాజ, ఓంకార్, గోపాలకృష్ణ, ఓసి అసోసియేషన్ కంపెనీ కార్యదర్శి తురగా రామకృష్ణ, 327 యూనియన్ కంపెనీ అధ్యక్షులు భూక్య నాగేశ్వరావు, 1104 రీజనల్ సెక్రటరీ ఎం రమేష్, 327 డివిజనల్ అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి దొర, నాయకులు భీమేశ్వరరావు,సాయిబాబా, సాల్మన్ రాజు,రాష్ట్రంలోని ఏడీఈలు,ఏఈలు, విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.