లలితా పీఠంలో ఘనంగా శ్రీసీతారామ కళ్యాణం
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరం, పాతబస్తీలో వెలసిన శ్రీ లలితా పీఠం నందు శ్రీ సీతా రామ కళ్యాణం అత్యంత వేడుకగా జరిగింది. పీఠాధిపతులు శ్రీగురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, మేడా వైష్ణవి ఆధ్వర్యంలో ముందుగా హనుమత్సమేత సీతారామ లక్ష్మణులను సర్వాంగ సుందరంగా అలంకరించి, ముతైదువలు మంగళహారతులు, పూర్ణకుంభాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చిన మూర్తులను వేదపండితులు మామిళ్ళపల్లి రాఘవయ్య శర్మ మరియు జగన్మోహన శర్మ నేతృత్వంలో కళ్యాణం కమనీయంగా జరిగినది. గత తొమ్మిది రోజులుగా మేడా వైష్ణవి మరియు లలితా సంఘం అధ్యక్షురాలు తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కళ్యాణంతో ముగిసినది. అంతకు ముందు శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళానిలయం అధ్యక్షులు బి.మల్లేశ్వరీ బృందం నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, శ్రీలక్ష్మి క్రేడో పాఠశాల కరస్పాండెంట్ తలపనూరి శ్రావ్యాకార్తిక్, విశ్వహిందూ పరిషత్ నాయకులు గూడూరు గిరిబాబు, శివపురం నాగరాజు, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రఘునాథ్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి బైసాని సురేష్, లలితా రాఘవేంద్ర స్వామి సత్సంగ కోలాటం అధ్యక్షులు రాఘవేంద్ర, వ్యాపారవేత్త కాశీ విశ్వనాథ గౌడుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
