వసంతోత్సవంతో ముగిసిన శ్రీ చౌడేశ్వరి మాత ఉగాది ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలంలోని ప్రముఖ శక్తిస్వరూపిణి శ్రీ చౌడేశ్వరి మాత బ్రహ్మోత్సవాలు మంగళవారం వసంతోత్సవ కార్యక్రమంతో ముగిశాయి. ఉదయం ఆలయం నుంచి చౌడేశ్వరీమాత ఉత్సవ విగ్రహాలను ఆలయ పూజారులు, సిబ్బంది తీసుకొని ఊరేగింపుగా రంగులు చల్లుకుంటూ వసంతోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో రామానుజన్, మాజీ చైర్మన్ పీఆర్. వెంకటేశ్వరరెడ్డి, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు రంగులు చల్లుకుంటూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయం ఎదురుగా ఉన్న కోనేరులో అమ్మవారి విగ్రహానికి చక్రస్నానం చేయించి ఆలయంలోకి చేర్చారు. దీంతో ఉగాది పర్వదినాన ప్రారంభమైన శ్రీచౌడేశ్వరీమాత ఏడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు ముగిశాయి.ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవాలు అందరి సహకారంతో విజయవంతంగా ఉత్సవాలు ముగియటం పట్ల సహకరించిన బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కాటసాని రామిరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మరియు సిబ్బంది వారికి , నందవరం గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల కు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు.