శివనామ స్మరణతో మారుమ్రోగిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయం
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం నాడు శివనామ స్మరణతో భక్తులతో కిక్కిరిసింది. ఉమ్మడి జిల్లా నలువైపుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పంచామృత కోనేరులలో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్యాంసుందర్ శర్మ ఉదయం 10 గంటలకు స్వామివారి ఆలయ ప్రవేశం, నంది వాహన సేవలతో బ్రహ్మోత్సవ కార్యక్రమాల్ని నిర్వహించారు. గణపతి పూజ, పుణ్య వాచనం ధ్వజారోహణం, బేరి పూజలు నిర్వహించారు. మహన్యాస పూర్వకంగా ఏకవార రుద్రాభిషేకము, అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు పరమ శివుడిని దర్శించుకుని దీక్ష విరమించడానికి ఆలయాలకు తరలిరావడంతో భక్తుల సందడితో శివాలయం కిటకిటలాడింది. హర హర మహాదేవ… శంబో శంకర… అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయం మార్మోగింది. ఆలయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ చైర్మన్ సునీల్ కుమార్ రెడ్డి లు వచ్చిన భక్తాదుల కొరకు ప్రత్యేక క్యూ లైన్లు, నీటి వసతి, పందిళ్లను ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వచ్చిన భక్తులకు కాశిరెడ్డి నాయన నిత్య అన్నదాన సత్రంలో భోజనం ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తాదుల కొరకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు చర్యలను ఏర్పాటు చేశారు.