PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేత్రపర్వంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  భూమిపై వెలసిన మొట్టమొదటి అర్చామూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారి కళ్యాణం వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన నలుగురు జీయర్ స్వాముల మంగళా శాసనముల మధ్య అత్యంత మనోహరంగా, నేత్రపర్వంగా సాగింది. ఉభయ దేవేరులను సువర్ణ భూషితులుగా అలంకరించి, శ్రీ రంగనాథునితో జరుగుతున్న కళ్యాణ విశిష్టత గురించి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ హృద్యంగా వివరిస్తూండగా, భక్తుల ఆనందాల మధ్య ఈ తంతు కొనసాగింది. కర్నూలు శివారులోని గోదాగోకులం నందు వెలసిన శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు జరుగుతున్న ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు హనుమద్వాహన సేవ , సాయంత్రం గరుడవాహనంపై తిరు మాడ వీధుల్లో విహరించారు. శ్రీమన్నారాయణాచార్య స్వామి యాజ్ఞికత్వంలో అర్చకులు రమేశ్ భట్టర్, కిరణ్ భట్టర్ బృందం ఈ కళ్యాణ క్రతువులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి, శ్రీ అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామి, ప్రయాగ్ రాజ్ రాఘవ ప్రపన్న జీయర్ స్వామి, పరమాత్మనందగిరి స్వామి, గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, పాలాది సుబ్రహ్మణ్యం, బాలసుధాకర్, భూమా కృష్ణ మోహన్, వేముల జనార్ధన్, తల్లం సురేష్, తలుపుల శ్రీనాథ్, పి.వెంకట సుబ్రహ్మణ్యం, మహేశ్వర రెడ్డి, కృష్ణ, తో పెద్ద సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నమాచార్య సంకీర్తనా విభావరి భక్తులను తన్మయులను చేసినది. టి.సాయిరాం గాత్రానికి  క్యాషియోపై యం.బాలస్వామి, తబలాపై వై.రమణ సహకారవాయిద్యాలు అందించారు.

About Author