20న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆరాధన మహోత్సవం
1 min read
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం, హోసూరు గ్రామ సమీపాన నరసమ్మ తోటలో వెలసిన శ్రీ మహాత్మ యోగి నరసింహస్వామి ఆరాధన మహోత్సవం ఈనెల 20న శనివారం నాడు వైభవంగా జరుపతల పెట్టామని నిర్వాహకులు తెలిపారు. 19వ తేదీ శుక్రవారం నాడు శ్రీ మహాత్మ యోగి లక్ష్మీనరసింహ స్వామి వారికి ఆరాధన కార్యక్రమం తో పాటు పంచామృత అభిషేకం, రాతాంగహోమం, రథోత్సవ కలశ స్థాపన అలాగే తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. శనివారం ఉదయం 12 గంటల సమయంలో మహాత్మా యోగి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవ కార్యక్రమం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కావున స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి భక్తాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి అనుగ్రహమును పొందగలరని వారు విజ్ఞప్తి చేశారు. మహాత్మ యోగి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ గోపురం, మండపం, నూతన రథం, రధశాల నిర్మాణాలు పూర్తి కాగా, వివాహాది శుభకార్యములకు కావలసిన వసతులు మరియు శ్రీ అమృతేశ్వర లింగము పంచముఖ శివ లింగం ఆలయ గోపురం, ధ్వజస్తంభం నిర్మాణాలు జరగవలసి ఉన్నవి. కావున భక్తాదులు యధాశక్తి తమ విరాళాలను సమర్పించవలసిందిగా ఈసందర్భంగా వారు కోరారు.