భక్తులతో పోటెత్తిన శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రం
1 min readభక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న భక్తులు
ప్రత్యేక పూజలు చేసిన సాయినాథ్ శర్మ దంపతులు
భక్తులకు అల్పాహారం ఏర్పాటు
పల్లెవెలుగు వెబ్ కమలాపురం: మండల పరిధిలో నెలకొన్న శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రం ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తాదులు క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో భక్తాదులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచే శ్రీ రామాపురం పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి మొదలైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చలో పందిళ్లు, క్యూ లైన్ లు, త్రాగునీటి సౌకర్యం తదితరాలను సాయినాథ్ శర్మ కల్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం మోక్ష నారాయణుని భక్తాదులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహావిష్ణువు స్వరూపుడైన మోక్ష నారాయణ స్వామిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు. గరుడ సేవ కార్యక్రమం కనుల పండుగ నిర్వహించారు. క్షేత్రంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ సంజీవిని మూలిక సహిత వీరాంజనేయ స్వామి మూలవిరాట్టులను భక్తులు దర్శించుకున్నారు. సాయినాథ్ శర్మ దంపతులను ప్రధాన అర్చకులు ఆశీర్వదించారు. గరుడ వాహనంపై మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామిని మాడ వీధుల గుండా ఊరేగించారు. పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు శ్రీరామాపురం మహా క్షేత్రాన్ని జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తాదులు తరలివచ్చి దర్శించుకున్నారని వారందరికీ తప్పకుండా మోక్ష నారాయణ స్వామి ఆశీస్సులు ఉంటాయని కాశీభట్ల తెలిపారు. ఉత్సవాల విజయవంతంగా సేకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.