శ్రీదేవి సోడా సెంటర్ సినిమా రివ్యూ
1 min readచిత్రం : శ్రీదేవి సోడా సెంటర్
నటీనటులు సుధీర్ బాబు, ఆనంది, నరేష్ , సత్యం రాజేష్, అజయ్, హర్షవర్ధన్
సంగీతం : మణిశర్మ – సినిమాటోగ్రఫీ : శామ్ దత్ – ఎడిటింగ్ : ఏ. శ్రీకర్ ప్రసాద్ – రచయిత : నాగేంద్ర కసి
దర్శకత్వం : కరుణ కుమార్
నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
నిర్మాణ సంస్థ : 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్
విడుదల తేది : 27-8-2021
సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్ లు గా నటించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్
. సినిమా పేరు మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. పలాస దర్శకుడు కరుణ కుమార్ తనదైన శైలిలో మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గ్రామీణ నేపథ్యంలో సాగే లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాకు దర్శకుడు సామాజిక అంశాల్ని జోడించి తెరకెక్కించారు. ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరించిందో.. లేదో థియేటర్లలో చూడాలి.
కథ : లైటింగ్ సూరి బాబు, సోడాల శ్రీదేవి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వస్తారు. వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోరు. మరోవైపు తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా సూరిబాబు ఒక వ్యక్తిని స్ర్కూ డ్రైవర్ తో పొడుస్తాడు. దీంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన శ్రీదేవి, సూరిబాబుల ప్రేమ కథ జైలు చుట్టూ తిరుగుతుంది. సూరిబాబు పై హత్య కేసు నమోదవుతుంది. హత్య కేసులో సూరిబాబుకు శిక్షపడుతుందా ?. సోడాల శ్రీదేవితో పెళ్లి జరుగుతుందా ? అన్నది సినిమాలో చూడాలి.
సినిమా ఎలా ఉందంటే :
పలాస సినిమా దర్శకుడు కరుణ కుమార్ మరోసారి తన మార్కును సినిమాలో చూపించారు. మొదటి భాగంలో సినిమా కొంత స్లోగా హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ నడిపారు. ఇంటర్వెల్ కు ముందు అసలు ట్విస్ట్ వస్తుంది. ఇది సినిమాకే టర్నింగ్ పాయింట్. ఇంటర్వెల్ తర్వాత ఏం జరుగుతుందా ? అనే ఆసక్తి ప్రేక్షకుడిలో కలిగేలా చేశారు. సినిమా రెండో భాగంలో మరికొంత స్లోగా సినిమా నడుస్తుంది. కానీ క్లైమాక్స్ లో ప్రేక్షకుడు ఊహించని విధంగా సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు కరుణ కుమార్.
నటీనటుల విషయానికి వస్తే సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డారు. సినిమాలో చాలా బాగా నటించారు. హీరోయిన్ ఆనంది కూడ బాగా నటించింది. సీనియర్ యాక్టర్ నరేష్ నటన అదిరిపోయింది. హీరోయిన్ తండ్రి పాత్రలో నరేష్ జీవించేశారు. తన మేనరిజంతో సినిమాకు పెద్ద ఎసెట్ గా మారారని చెప్పుకోవచ్చు. హీరో స్నేహితుడి పాత్రలో రాజేష్ , తండ్రి పాత్రలో రఘుబాబు తమ పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ విషయంలో శాందత్ ఇంకొంచెం జాగ్రత్త పడాల్సి ఉంది. ఎడిటింగ్ విషయంలో కూడ శ్రీకర ప్రసాద్ తన కత్తెరకు పని చెప్పాల్సింది. కొన్ని సీన్లు అతకనట్టు ఉంటాయి. వీటి విషయంలో జాగ్రత్త పడాల్సింది. కథరచయిత నాగేంద్ర కసి మంచి కథను రాశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని కథకు సామాజిక అంశాలను జోడించి చక్కగా తీర్చిదిద్దారు. ఈ కథకు దర్శకుడు కరుణ కుమార్ ప్రాణం పోశాడు.
ఫైనల్ జడ్జిమెంట్ : ఓవరాల్ గా సినిమా బాగుంది. కథలో కొత్తదనం ఉంది. దర్శకుడు కథను బాగా డీల్ చేశాడని చెప్పుకోవచ్చు.
గమనిక: ఈ రివ్యూ కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.