ఫిర్యాదుల పై సమగ్ర చర్యలు తీసుకునేలా సిబ్బందికి శిక్షణ అందించాలి..
1 min readజిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా : ఎన్నికల సమయంలో ప్రజల నుండి అందే ఫిర్యాదులపై సమగ్ర చర్యలు తీసుకునేలా సిబ్బందికి శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ మరియు పర్యవేక్షణ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ప్రజల ఫిర్యాదుల రూపంలో తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు 18002331077 మరియు 1950 ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెంబర్ల కు ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. సదరు టోల్ ఫ్రీ నెంబర్ పై విస్తృత ప్రచారం ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, శాంతి భద్రతలకు సంబందించిన సమస్యలు, ఇతర అంశాలపై ప్రజల నుండి అందే ఫిర్యాదులు, వివిధ ప్రసార మాధ్యమాలలో వచ్చే సమాచారాన్ని, ప్రజల నుండి ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం గురించి పంపడం, తీసుకున్న చర్యలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం వంటి విధులను జిల్లా ఎన్నికల పర్యవేక్షణ కేంద్రం సిబ్బంది నిర్వర్తించవలసి ఉంటుందన్నారు. ఈ అంశాలపై సదరు సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ డి. పుష్పమణి, కలెక్టరేట్ పరిపాలనాధికారి కె. కాశీ విశ్వేశ్వరరావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.