PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టాంపు పేపర్లే అక్కర్లేదు..ఈ – స్టాంపింగ్ అయినా చట్టబద్దమే

1 min read

–నాన్ జుడీషియల్ స్టాంపుల కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు
– ఏలూరు రేంజ్ రిజిస్ట్రేషన్&స్టాంప్స్ డిఐజి కె.ఆబ్రహామ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : అఫిడవిట్లకూ, అగ్రిమెంట్లకు, దస్తావేజుల రిజిస్ట్రేషన్ కు స్టాంపు పేపర్లే అక్కర్లేదని, ఈ- స్టాంపింగ్ అయినా చట్టబద్దమేనని ఏలూరు రేంజ్ రిజిస్ట్రేషన్&స్టాంప్స్ డిఐజి కే.ఆబ్రహామ్ ఒక ప్రకటనలో తెలిపారు. అఫిడవిట్లకూ, అగ్రిమెంట్లకు, దస్తావేజుల రిజిస్ట్రేషన్ కు ప్రజలు సాంప్రదాయకంగా నాన్ జుడీషియల్ స్టాంపులను వాడటం పరిపాటిఅని, అయితే నాన్ జుడీషియల్ స్టాంపులకు సమాంతరంగా స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ వారిచే ఈ-స్టాంపింగ్ విధానం ఇటీవలే ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ-స్టాంపింగ్ విధానంలో కూడా ప్రజలు తమకు అవసరమైన నాన్ జుడీషియల్ స్టాంపులను పొందవచ్చన్నారు. ఈ స్టాంపింగ్ ద్వారా వేయబడిన స్టాంపులు, సాధారణ నాన్ జుడీషియల్ బాండు పేపర్లతో సమమైన చలామణీ గలవన్నారు. వీటిని దస్తావేజుల రిజిస్ట్రేషన్ నిమిత్తం కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చన్నారు. ఈ- స్టాంపింగ్ ద్వారా స్టాంపుల అమ్మకం లైసెన్సుల కొరకు ప్రజలు దరఖాస్తు చేసుకుంటే, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ వారు సత్వరమే లైసెన్సులు మంజూరు చేస్తున్నారన్నారు. పైగా, దస్తావేజులను నాన్ జుడీషియల్ స్టాంపుల మీద రాసుకున్నా, ఈ స్టాంపింగ్ ద్వారా ముద్రలు పొందినా రిజిస్ట్రేషన్ కు అనుమతించేలా సబ్ రిజిస్ట్రార్లందరికీ మార్గదర్శకాలు ఇప్పటికే జారీ చేశామన్నారు. మీ సమీపంలోని ఈ-స్టాంపింగ్ కేంద్రాల, లైసెన్స్డ్ వెండర్ల అందుబాటు వివరాలను www.registration.ap.gov.in లేదా http://www.shcilestamp.com లలో తెలుసుకోవచ్చునన్నారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలూ, బ్యాంకులలో వాడకంలో ఉండి, సులువుగా, వేగంగా, వెంటనే పూర్తయ్యే ఈ- స్టాంపింగ్ విధానాన్ని ప్రజలు విరివిగా వినియోగించుకోవాలన్నారు. ఏలూరు రేంజ్ డిఐజీ పరిధిలోని ఏలూరు, భీమవరం రిజిస్ట్రేషన్ జిల్లాల్లో విస్తరించిన అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ప్రజల ఉపయోగార్ధం నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. పది, ఇరవై, యాభై, వంద రూపాయల ముఖవిలువ గల స్టాంపులు ఆయా సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లోని కౌంటర్లలోనూ, అధీకృత స్టాంపువెండర్ల వద్దా ఇవి అమ్మకానికి ఉన్నాయన్నారు. ఏ కార్యాలయ పరిధిలోనైనా స్టాంపుల నిల్వలు తగినంతగా లేకుంటే, వెంటనే పొరుగు జిల్లాల నుంచి సర్దుబాటు ప్రక్రియ జరుగుతున్నదన్నారు. నాన్ జుడీషియల్ స్టాంపుల కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. నాన్ జుడీషియల్ స్టాంపుల అందుబాటు విషయమై ఏలాంటి వదంతులనూ, ప్రచారాలనూ ప్రజలు విశ్వసించవద్దని, ఏదైనా సమాచారం కొరకు నేరుగా ఆయా జిల్లాల జిల్లా రిజిస్ట్రార్లను సంప్రదించవచ్చనీ తెలిపారు.

About Author