ప్రజా సమస్యలను పరిష్కరించేదిశలో ముందుకు వెళ్తున్నాం.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్
1 min read
మీ సమస్య – మా పరిష్కారం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి టీజీ భరత్
జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి టీజీ భరత్
అక్కడికక్కడే పలు సమస్యలను పరిష్కరించిన మంత్రి
కర్నూలు, న్యూస్ నేడు: ప్రజా సమస్యలను పరిష్కరించే దిశలో తాము ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నియోజకవర్గ ప్రజల నుండి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం కోసం ఆయన మీ సమస్య – మా పరిష్కారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన కార్యాలయంలోని శ్రీ ఆర్య ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించి జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాతో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు.కర్నూలు నగరంలోని వివిధ వార్డుల నుండి ప్రజలు వచ్చి త్రాగునీటి సమస్యలు, విద్యుత్ స్తంబాలు, డ్రైనేజీ, పింఛన్లు, ల్యాండ్ సమస్యలు, ఉద్యోగాల కొరకు అప్లికేషన్లు, ప్రభుత్వాసుపత్రికి సంబంధించిన సమస్యలు, రెవెన్యూ సేవలు, ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులు, ప్రాపర్టీ టాక్స్, రోడ్లు, పార్కులు, పలు అభివృద్ధి పనులు చేయాలంటూ మొత్తం 144 సమస్యలకు సంబంధించి వినతిపత్రాలు అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం వచ్చిన దరఖాస్తులు తీసుకొని వెంటనే సహాయం అందేలా కృషి చేస్తామని బాదితులతో మంత్రి చెప్పారు. దీంతో పాటు త్రాగునీటి సమస్యలను వెంటనే మున్సిపల్ కమిషనర్‌కు చెప్పి పరిష్కరించాలని చెప్పారు. నిరుద్యోగులతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ కోసం ఏర్పాటుచేసిన సీడ్ ఏపీ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వంలో తప్పకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. వార్డుల్లో డ్రైనేజీల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నియోజకవర్గంలోని ప్రజలు సమర్పించిన వినతులను సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు దాటిందని, కర్నూలులో ఉండే సమయంలో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నియోజకవర్గంలోని ప్రజల నుండి వచ్చే వినతులను స్వీకరించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా ఈరోజు నూతనంగా “మీ సమస్య – మా పరిష్కారం” అనే కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించి అధికారుల సమక్షంలోనే సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఢిల్లీతో పాటు విదేశాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అందుకే నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అధికారులు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. ప్రజల సమస్యలు తీర్చేదే తమ ఎన్డీయే ప్రభుత్వం అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఆర్డీఓ సందీప్, టౌన్ డిఎస్పి బాబు ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
