దెందులూరు ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు
1 min read– రూ.2.50 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్రం
– దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. దెందులూరు గ్రామంలో రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను ఎమ్మెల్యే స్థానిక వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సామాజిక ఆరోగ్య కేంద్రానికి అవసరమైన వైద్య పరికరాల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొఠారు మీడియాతో మాట్లాడుతూ దెందులూరు పరిసర 12 గ్రామాలకు సంబంధించిన ప్రజలకు అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కోరడం జరిగిందని ఈ నేపథ్యంలో సుమారు రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మించడంతోపాటు అత్యాధునిక వైద్య సేవలు ప్రజలకు అందించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలు ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జానంపేట బాబు, వైసిపి గ్రామ అధ్యక్షులు పోకల రాంబాబు, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డ్ కమిటీ మెంబర్ తొత్తడి వేధకుమారి, వైస్ ఎంపీపి వేమూరి జితేంద్ర, సహకార బ్యాంకు అధ్యక్షుడు కొలుసు గణపతి యంపీటిసీ తాళ్లూరి నాగరాజు, పులిపాటి శ్యామల, శివాలయం ఛైర్మన్ పాలడుగుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.