గోరుకల్లు రిజర్వాయర్ పటిష్టతకు చర్యలు చేపట్టాలి
1 min read– అన్నమయ్య, అలగనూరు ప్రాజెక్టుల పరిస్థితి గోరుకల్లు రిజర్వాయర్ కు రాకుండా భద్రతా చర్యలు చేపట్టాలి.
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: SRBC ప్రాజెక్టుకు ఆయువుపట్డు లాంటి గోరుకల్లు రిజర్వాయర్ బలహీనమై అక్కడక్కడ మట్టి కట్టలు కుంగిపోతున్నాయని, రిజర్వాయర్ ప్రస్తుత పరిస్థితి పట్ల రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి లు ఆందోళన వ్యక్తం చేశారు.శనివారం నంద్యాల జిల్లా కేంద్రంలోని SRBC డిప్యూటీ సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ ని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు కలిసి గోరుకల్లు రిజర్వాయర్ పై వినతి పత్రం అందచేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .వర్షాకాలంకు ముందే పూర్తి చేయాల్సిన నిర్వహణ పనులలో తాత్సారం చేయడం వలన లక్షలాది ప్రజల జీవన, సాంఘిక ఆర్థిక పరిస్థితిలపై తీవ్రమైన వ్యతిరేకం ప్రభావం ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గోరుకల్లు రిజర్వాయర్ బలహీన కట్టల పరిస్థతిపై గతంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అద్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి సాగునీటి శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారన్న విషయాన్ని వారు గుర్తు చేస్తూ రిజర్వాయర్ భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతుందని అధికారులు హామీ ఇచ్చారన్నారు. కానీ గోరకల్లు రిజర్వాయర్ మట్టి కట్టల ప్రస్తుత పరిస్థితి రైతాంగం వెన్నులో వణుకు పుట్టిస్తున్నదని వారు చెప్పారు. రిజర్వాయర్ నిర్వహణ సక్రమంగా నిర్వహించని పక్షంలో జరిగే నష్టాలపై రాయలసీమ వాసులకు ప్రత్యక్ష అనుభవమూ, అవగాహన ఉందని వారు పేర్కొంటూ రిజర్వాయర్ నిర్వహణ సరిగా లేకపోవడంవలన కుంగిపోయిన అలగనూరు రిజర్వాయర్ వలన పసుపక్ష్యాదులతో పాటు మనుషులకు త్రాగు నీరు, ఆరుతడి పైర్లకు నీరు లభించకపోవడంతో ఉండే సామాజిక, సాంఘిక, ఉపాధి, ఆర్థిక, ఇబ్బందులను ఐదు సంవత్సరాలగా రైతులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణ సరిగా చేపట్టకపోవడం వలన, ప్రాజెక్టు తెగిపోవడంతో జరిగిన ప్రాణ, ఆస్తి, నివాస, ఉపాధి నష్టాలను కూడా వారు వివరించారు.రిజర్వాయర్ల నిర్వహణ సక్రమంగా లేకపోతే ఉత్పన్నమయ్యే పరిస్థితులు పునరావృతం కాకుండా తక్షణమే యుద్ద ప్రాతిపదికన గోరకల్లు రిజర్వాయర్ పటిష్టతకు చర్యలు చేపట్టాలని సాగునీటి అధికారులకు విజ్ఞప్తి చేసారు.సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్వహణ కార్యక్రమాలు చేపట్టకపోతే “సంక్షోభమే” చివరికి మిగులుతుందని పాలకులు గమనించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు భాస్కర్ రెడ్డి, పట్నం రాముడు, ఏరువ రామిరెడ్డి, కొమ్మా శ్రీహరి, రాఘవేంద్రగౌడ్, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.