PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా చర్యలు తప్పవు..

1 min read

– జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్

– బాణసంచా విక్రయదారులు  చట్టం సూచించిన నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి.

– దీపావళి పర్వదినాన టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లాలో టపాసులు ఎక్కడైనా అక్రమంగా విక్రయిస్తున్నా, నిల్వ ఉంచినా డయల్ 100  గాని, స్ధానిక  పోలీసు స్టేషన్ లో గాని  సమాచారం అందించాలి. జిల్లాలో   ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా  అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా అటువంటి వారి పై ప్రేలుడు పదార్థాల చట్టం, ఐపిసి సెక్షన్స్ ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయించాలని విక్రయదారులకు  జిల్లా ఎస్పీ   పలు సూచనలు చేశారు. సూచించిన బహిరంగ ప్రదేశాలలో నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక షెడ్డులలో దుకాణాలు ఏర్పాటు చేసుకోని నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చిన్న పిల్లలను  విక్రయాల పనుల్లో ఉంచుకోరాదన్నారు. లైసెన్స్ లు కల్గిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు చేయాలన్నారు. దీపావళి పర్వదినం  రోజున జిల్లా ప్రజలు ఆనందంగా జరుపుకోవాలన్నారు.  టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.   ముఖ్యంగా  చిన్న పిల్లల పట్ల  అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బాణ సంచాను అనుమతి లేకుండా నిల్వ ఉంచినా విక్రయాలు జరిపినా తయారుచేసినా వాటిని వినియోగించినా అటువంటి వారి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోలీసు వారి నియమ నిబంధనలను  ఉల్లంఘిస్తే  చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా ప్రమాదం చోటు చేసుకున్నా, అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా వెంటనే డయల్ – 100 లేదా సంబంధిత పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని,  సమాచారం చేరవేసిన వారి వివరాలు  గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్  తెలిపారు.

About Author